సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మం జడ్పీసెంటర్ : అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. సర్వేపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రామ ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శనివారం వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రసుత్తం సుమారు 8లక్షల 59 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. సర్వే పక డ్బందీగా జరిగేందుకు జిల్లాను 29,951 ఎన్యూమరేట్ బ్లాకులుగా విభజించినట్లు చెప్పారు. ఎన్యూమరేటర్లు ప్రతి కుటుంబంలో సరైన వివరాలు నమోదు చేసేలా గ్రామ, వార్డు ప్రత్యేకాధికారులు కృషిచేయాలన్నారు.
గ్రామ ప్రత్యేకాధికారులు తమ పంచాయతీకి సంబంధించిన రేషన్‌కార్డులు, భూమి, గృహ సంబంధ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 19న ఉదయం 7గంటలకు సర్వే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఎన్యూమరేటర్ల అవసరమైన సామగ్రి ఒక రోజు ముందుగానే చేరేలా చూడాలన్నారు. ఏ ఇళ్లు ఏ బ్లాక్‌లో ఉన్నాయో ప్రత్యేకాధికారులు గమనించాలన్నారు. మహిళా ఎన్యూమరేటర్లకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరం మినహామిగతా అన్ని చోట్ల స్టిక్కరింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. స్టిక్కరింగ్ లేని వారు సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలన్నారు. సర్వే సామగ్రి పంపిణీని ఈనెల 18లోగా పూర్తి చేయాలని సూచించారు.
మున్సిపాలిటీలో సర్వే సజావుగా జరిగేందుకు ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు, పుట్టింటికి వెళ్లిన గర్భిణులు సర్వే రోజు ఇంట్లో లేనిపక్షంలో వారికి సంబంధించిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు చూసి ఎన్యూమనేటర్లు వివరాలు నమోదు చేయాలన్నారు. ఉత్తమ ఎన్యూమరేటర్లకు నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందిస్తామని ప్రకటించారు. వీడియోకాన్ఫరెన్‌సలో జేసీ సురేంద్రమోహన్, ఏజేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.