సాక్షి, ఖమ్మం: జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీకి మెజారిటీ ఉన్నా ఇందులో ఏ వర్గం సభ్యురాలిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారోనని జడ్పీటీసీలంతా ఎదురుచూశారు. చివరకు తుమ్మల వర్గానికి చెందిన గడిపల్లి కవిత టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి అని కలెక్టెర్ డాక్టర్ కె.ఇలంబరితి ప్రకటించడంతో ఉత్కంఠకు తెరతొలగింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమమంతా కలెక్టర్ అన్నీ తానైన డిపించారు.
ఉదయం 8 గంటల నుంచి కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. అయితే నిర్ణీత సమయం 10 గంటలలోపు టీడీపీ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా మహ్మద్ మౌలానా, సీపీఎం అభ్యర్థిగా సయ్యద్ జియావుద్దీన్ నామినేషన్లు దాఖలు చేశారు. 9.30 గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెడ్పీలోకి వచ్చి టీడీపీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల బీ ఫారాలు కలెక్టర్‌కు అందజేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మ తరఫున కలెక్టర్‌కు బీ ఫామ్ అందజేశారు. ఉదయం ప్రారంభమైన కో ఆప్షన్ సభ్యుల నామినేషన్లు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. కలెక్టర్, జెడ్పీ సీఈఓ జయప్రకాశ్‌నారాయణ ఎన్నిక నిర్వహణ బాధ్యతను పూర్తి చేశారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు క్యాంపు నుంచి టీడీపీ సభ్యులను పార్టీ నేతలు జెడ్పీ హాల్‌లోకి తీసుకొచ్చారు. వారి వెంట ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని ఉన్నారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు సభ్యులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరయ్యారు.
తర్వాత ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్యతో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు వచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ ఎన్నిక సమావేశాన్ని ప్రారంభి మాట్లాడుతూ.. ‘డాక్టర్. కె. ఇలంబరితి అను నేను అంటూ..’ తనను తాను పరిచయం చేసుకున్నారు. కో ఆప్షన్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నియమావళిని సభ్యులకు వివరించారు.
1.15కు సభ్యులకు ప్రమాణ స్వీకార పత్రాలను అందజేయడంతో పాటు సమావేశానికి హాజరైన వారి సంతకాలు సేకరణ పూర్తి అయింది.
39 మంది సభ్యులుండడంతో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు కోరం ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత టీడీపీ సభ్యులు గ్రూపుగా, వారి తర్వాత సీపీఎం, ఎన్డీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీ సభ్యులు ఆత్మ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు.
మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రారంభించారు. సీపీఐకి చెందిన మహ్మద్ మౌలానాను మణుగూరు జెడ్పీటీసీ సభ్యురాలు పి.దుర్గ ప్రతిపాదించగా అశ్వారావుపేట జెడ్పీటీసీ మల్లికార్జునరావు బలపరిచారు. సీపీఎంకు చెందిన సయ్యద్ జియావుద్దీన్‌ను దుమ్ముగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి ప్రతిపాదించగా బోనకల్ జెడ్పీటీసీ బాణావత్ కొండ బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరిద్దరు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటిచారు. ఆతర్వాత భోజన విరామం అనంతరం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మధ్యాహ్నం 3 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికకు కోరం కోసం సభ్యుల సంతకాలు తీసుకుని, చైర్ పర్సన్ ఎన్నికను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
టీడీపీ, కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థులుగా వెంకటాపురం జెడ్పీటీసీ గడిపల్లి కవిత, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మలకు ఆయా పార్టీ నేతలు బీఫారాలు ఇచ్చారని, వారే పోటిలో నిలిచే అభ్యర్థులుగా కలెక్టర్ వెల్లడించారు.
గడిపల్లి కవితను కారేపల్లి జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్ ప్రతిపాదించగా దుమ్మగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి బలపరిచారు. జాడి జానమ్మను టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ ప్రతిపాదించగా కామేపల్లి జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్ బలపరిచారు.
3.25 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా గడిపల్లి కవితకు మద్దతు ఇచ్చే వారు చేతులు ఎత్తాలని కలెక్టర్ కోరగా, 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు ఆమెకు మద్దతు తెలిపారు. జాడి జానమ్మకు మద్దతు తెలిపేవారిని చేతులెత్తాలని కోరగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులెత్తారు. 22 మంది సభ్యులు కవితకు మద్దతు పలకడంతో ఆమె చైర్ పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఆ తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
3.32 గంటలకు కలెక్టర్ వైస్ చైర్మన్ ఎన్నికను ప్రారంభించారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరపాటి వాసుదేవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీడీపీ నేతలు బీ ఫాం ఇచ్చారని కలెక్టర్ సమావేశంలో తెలిపారు.
పోటీకి ఇతర పార్టీల నుంచి ఎవరూ లేకపోవడంతో అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.
సాయంత్రం 3.50 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌గా గడిపల్లి కవిత, బరపాటి వాసుదేవరావు ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ కలెక్టర్ వారికి డిక్లరేషన్ అందజేశారు.
సాయంత్రం 3.55 గంటలకు ఈ ఎన్నిక సమావేశం ముగిసిందని, సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ కార్యక్రమాన్ని ముగించారు.
ఉత్కంఠగా ‘జడ్పీ’ ఎన్నిక
Published Fri, Aug 8 2014 4:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement