సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. పార్టీలకతీతంగా పేదలంతా ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నిర్మించిన తరహాలోనే పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ ప్రజలకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని, ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని, ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టుకోవాలంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని సమర్థించినట్టేనని, ఈ కుట్రలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు. ల క్షలాది మంది ఆదివాసీలను జలసమాధి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదో సభ్యసమాజానికి తెలియజేయాలని ఇతర పార్టీలను కోరారు.
కిరణ్ పేరిట పత్రికలకు విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలివి...
‘లక్షలాది మంది ప్రజలను జలసమాధి చేస్తూ, వేలాది ఎకరాల సాగుభూములను ముంచుతూ, వందలాది గ్రామాలను నామరూపాలు లేకుండా చేస్తున్న పోలవరం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించడం లేదో సభ్య సమాజానికి తెలియజేయాలి. మొన్నటికి మొన్న ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి అధికారంలోనికి వచ్చిన తర్వాత హామీలను గాలిబుడగల్లాగా వదిలివేసి, ప్లేటు ఫిరాయించి ప్రాజెక్టు ఎత్తు తగ్గించమనడం, ముంపు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంచాలనడం, ఇప్పుడు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం అంటే పోలవరం ప్రాజెక్టును కట్టుకోమని చెప్పడమే. అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పోలవరం ప్రాజెక్టు ఊసెత్తకుండా ఆర్డినెన్స్ పేరిట ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. అందరూ ఒక గూటి పక్షులే. అయితే ఇక్కడ నష్టపోయేది ఆదివాసీ ప్రజలు, వెనుకబడిన వర్గాలే. పార్టీలు వేరు కావచ్చు కానీ పాలకవర్గాలు ఒక్కటే. ప్రజలారా కళ్లు తెరవండి. ఇకనైనా ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలం దేవస్థానం కూడా జలమయం అవుతుంది. గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లు, కళా సంస్కృతి కనబడకుండా పోతాయి. గిరిజనులు అన్నింటికీ దూరమై చినిగిన విస్తరిలా తయారవుతారు.
సామ్రాజ్యవాద విధానాలను పెట్టుబడి దారీ గుత్త సంస్థల ద్వారా అమలు చేయడం కోసం కోస్తాంధ్ర భూస్వాముల భూముల మూడోపంటకు సాగునీరు ఇవ్వడం కోసం, కృష్ణానదికి అనుసంధానం చేసి పెట్టుబడిదార్ల కారిడార్లకు నీరిచ్చేందుకు మూడు రాష్ట్రాల ఆదివాసీలను ముంచుతున్నారు. ఆదివాసీజాతిని అంతం చేసైనా పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనేది పాలకుల కుట్ర.
ప్రజలారా ఆలోచించండి... మొన్నటివరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా అయితే పోరాడారో అదే విధంగా ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు వద్దని తెగించి మిలిటెంట్‌గా పోరాడి విజయం సాధించాలి. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. పార్టీలకు, సంఘాలకు అతీతంగా పేదజాతి అంతా ఒక్కతాటిపై పెద్ద ఎత్తున కదలాలి. ఎక్కడా రాజీపడకుండా, ప్రలోభాలకు గురికాకుండా పోరాడి విజయం సాధించాలి. ఈ సమాజానికి వేగుచుక్కలై నిలవాలి. అంతిమ విజయం ప్రజలదే.’
పోల‘రణం’ చేయండి
Published Wed, Jul 23 2014 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement