కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం  | Kaleshwaram Water Very Useful For Nalgonda | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం 

Published Mon, Dec 16 2019 9:08 AM | Last Updated on Mon, Dec 16 2019 10:32 AM

Kaleshwaram Water Very Useful For Nalgonda - Sakshi

మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, తుంగతుర్తి : గోదావరి జలాల కోసం 50 ఏళ్లుగా పోరాడాం.. వేయి కళ్లతో ఎదురుచూశాం.. కానీ చుక్కనీరు రాలేదు. కాళేశ్వరం జలాల పుణ్యమాని ప్రస్తుతం జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో సీనియర్‌ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని ఆదివారం తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు డాక్టర్‌ గాదరి కిశోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీచైర్‌పర్సన్‌ గుజ్జ దీపికయుగేందర్‌రావులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ సభలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో మొదటి ఫలాలు సూర్యాపేట జిల్లాకే దక్కాయన్నారు. జిల్లా పరిస్థితిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మొట్టమొదట జిల్లాకు విడుదల చేయించారని గుర్తుచేశారు. రెండు నెలల నుంచి కాళేశ్వరం జలాలు నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయన్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంట లు నిండి, నీటితో కళకళలాడుతున్నాయన్నారు. 

కేసీఆర్‌ సీఎం కాకపోతే  కాళేశ్వరం జలాలు వచ్చేవి కావు
కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావన్నారు. హుజూర్‌నగర్‌ ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో ఆగి గోదావరి జలాలను చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన కళ్లల్లో చూసిన ఆనందం మళ్లీ కాళేశ్వరం జలాలు చూశాక వచ్చిందన్నారు. సమైక్యాంధ్రలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉండడం వల్ల 69 డీబీఎం పరిధిలో మరికొన్ని చెరువులకు నీరుపోవడం లేదని ఆ పరిస్థితిని ప్రస్తుతం చక్కదిద్దనున్నట్లు చెప్పారు.

దివంగత నేతలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు బతికి ఉంటే గోదావరి జలాలను చూసి ఎంతో ఆనందపడేవారని గుర్తుచేశారు. తాము చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గోదావరి జలాల వస్తున్నాయని వారి ఆత్మలు ప్రస్తుతం శాంతిస్తాయని చెప్పారు. చెరువులు నిండితేనే ఊర్లు పచ్చగా ఉండి రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం 5ఏళ్లలో సాధించానని గుర్తుచేశారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపడానికి తన శాయశక్తులా కృషి చేశానని తెలిపారు. గతంలో నియోజవర్గంలో హత్యలతో రక్తం పారిందని, కానీ ప్రస్తుతం వాటికి స్వస్తిపలికి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాని చెప్పారు.

రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్నది తుంగతుర్తి నియోజకవర్గమేనని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మనోజ, జేసీ సంజీవరెడ్డి, జెడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ  చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, జిల్లా చైర్మన్‌ ఎస్‌ఏ రజాక్, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, వర్ధెల్లి శ్రీహరి, క్రిష్ణ, వజ్జ వీరయ్యయాదవ్, ఎన్‌.అయోధ్య, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, సర్పంచ్‌ నకిరేకంటి విజయ్, బుద్ద సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు అబ్దుల్లా, గుడిపాటి సైదులు, వెంకటనారాయణ, సీతయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

వర్ధెల్లికి పలువురి అభినందన 
సీనియర్‌ జర్నలిస్టు, పిట్టవాలిన చెట్టు పుస్తక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గాదరి కిశోర్‌కుమార్, రామలింగారెడ్డితో పాటు పలువురు అభినందించారు. గతంలో చెంచులపై మరణం అంచున, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణపై పిట్ట వాలిన చెట్టు అనే పుస్తకాలను రాయడం అభినందనీయమన్నారు. సామాజిక సృహ ఉన్న జర్నలిస్టు అని కొనియాడారు. తన నిధుల నుంచి ఈ పుస్తకానికి అయ్యే ఖర్చుకు సాయం అందిస్తానని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ ప్రకటించారు.

చరిత్రను గుర్తుచేయడం కోసమే ఇలాంటి పుస్తకాలను రాస్తున్నారని చెప్పారు. మంచి రచయితగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రచయిత వెంకటేశ్వర్లు కోరిక మేరకు ఆయన స్వగ్రామం కొత్తగూడెంకు కావాలి్సన నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

మంత్రులకు ఘన స్వాగతం 
రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు ఆదివారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో తుంగతుర్తి నుంచి కొత్తగూడెం వరకు భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అలాగే కొత్తగూడెం గ్రామస్తులు బతుకమ్మలు, కోలాటాల బృందంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వెన్నెల నాగరాజు కళాబృందం ఆధ్వర్యంలో వివిధ రకాల కళాప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గోరెటి వెంకన్న పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. కాగా యాదవసంఘం ఆధ్వర్యంలో మంత్రులకు గొర్రెపిల్లలను, గొంగడిని బహూకరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement