విచారణకు భయమెందుకు? | Dasoju sravan kumar on jagadeeswar reddy | Sakshi
Sakshi News home page

విచారణకు భయమెందుకు?

Published Tue, Apr 17 2018 1:34 AM | Last Updated on Tue, Apr 17 2018 1:34 AM

Dasoju sravan kumar on jagadeeswar reddy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డాక్యుమెంట్లు, ఆధారాలతోసహా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీల బాగోతాలు, అవినీతి అంశాలను తాము బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందించకుండా బినామీ సైదిరెడ్డితో ప్రకటనలు ఇప్పించారని, జగదీశ్వర్‌రెడ్డి అవినీతిపై ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని నిలదీశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

కుడకుడ గ్రామంలో సర్వే నంబర్‌ 301, 302లో ఉన్న సాయి డెవలపర్స్‌కు చెందిన ప్రైవేట్‌ భూమిని రూ.18 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సూచించారని, ఆయన సూచన మేరకే కొనుగోలు చేశామని కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌లో (లెటర్‌ నంబర్‌ ఇ1–143–2017, తేదీ 02–08–2017) పేర్కొన్నారని, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రమేయం ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు.

ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ దృష్టికి ఎందుకు రావడం లేదో తమకు అర్థంకావడం లేదని, జగదీశ్వర్‌రెడ్డి అంటే కేసీఆర్‌కు గారాబం ఎందుకని ఎద్దేవా చేశారు. దళితుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీదనే కేసీఆర్‌ తన ప్రతాపాన్ని చూపారని, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రెడ్డిల అవినీతిపై తాము ఆధారాలతో మాట్లాడినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే సైదిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డికి బినామీ అయితే, జగదీశ్వర్‌రెడ్డి కేసీఆర్‌ బినామీనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

అలా కాకపోతే విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయంపైనా మంత్రి కేటీఆర్‌ ట్వీటర్‌లో స్పందిస్తారని, కానీ జగదీశ్వర్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. ఇది పక్కాగా క్విడ్‌ప్రోకో తరహాలో ఉందని, సైదిరెడ్డికి హుజూర్‌నగర్‌ టికెట్‌ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన ద్వారా కోట్ల రూపాయలు జగదీశ్వర్‌రెడ్డికి ముడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో తాము చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్, లోకాయుక్తకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్టు శ్రవణ్‌ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement