సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ మనస్తత్వంతో నడిచే కాంగ్రెస్ పార్టీ ఈ లేఖ ద్వారా తన కర్కశ, రైతు, పేదల వ్యతిరేక వైఖరిని నిస్సిగ్గుగా బయట పెట్టుకుందని విమర్శించారు.
ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన రైతుబంధు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిస్తోందని, రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసమే చూస్తోందని దాసోజు విమర్శించారు. ఎన్నికలు వస్తూ పోతుండటం సహజమని, వాటి కోసం రైతులు వ్యవసాయాన్ని ఆపలేరని పేర్కొన్నారు.
చిల్లర రాజకీయాల కోసం సమాజం కోసం నిస్వార్ధంగా కష్టపడే రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, భవిష్యత్తు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉంటూ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులను వేధించకూడదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు అర్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి జాలి, దయ లేకుండా ఈసీకి రాసిన క్రూరమైన లేఖను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని దాసోజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment