ఎవరి లెక్కలు వారివే..
ఓటమిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అంతర్మథనం
రెండు ఎంపీ సెగ్మెంట్లలో కమల వికాసం
జగిత్యాల, వేములవాడలో మోదీ సభల ప్రభావం
పెద్దపల్లిలోనూ గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ
జాప్యమే ఓటమికి కారణమంటున్న కరీంనగర్ కాంగ్రెస్
ఉద్యమ జిల్లాలో మూడో స్థానంలో కారు పార్టీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్‌లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్‌ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్‌లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..
ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్‌ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.
కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.
ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆలస్యమే కారణమా?
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.
నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.
బీజేపీలో జోష్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్‌లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్‌లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.
జీవన్‌రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్‌లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్‌ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.
ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్‌కు ప్రతీ రౌండ్‌లో గట్టి పోటీ ఇచ్చారు.
కరీంనగర్‌లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
బీఆర్‌ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?
ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్‌ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.
బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు
Comments
Please login to add a commentAdd a comment