సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకోగా.. వారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ కీలక నేతల యత్నాలు ఓవైపు.. ఇలాంటి వారికి గాలం వేసి, తమ తరఫున బరిలోకి దింపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఇతర పార్టీల ప్రయత్నాలు మరోవైపు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్‌ఎస్ టికెట్ దక్కని కొందరు నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అంతర్గతంగా ఇతర పారీ్టలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏయే నేతలు ఏ పార్టీ వైపు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యామ్నాయంపై అసంతృప్తుల లెక్కలు
ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్లు ఆశిస్తున్నవారు, వివిధ సందర్బాల్లో బీఆర్‌ఎస్ గూ టికి చేరినవారితో సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అలాంటి నేతల్లో ప్రస్తుతం టికె ట్ దక్కనివారు తమ రాజకీయ భవిష్యత్తు, ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ రాజ కీయ భవిష్యత్తుపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. అవకాశం దక్కనిచోట ఎందుకు ఉండాలని, ఇతర పార్టీల్లోకి వెళదామని అనుచరులు నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనితో ఏ పారీ్టలో చేరితే ఏ మేర ప్రయోజనం ఉంటుందన్న దానిపై అసంతృప్తులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇలాంటి నేతలతో కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పారీ్టలో చేరాలని ఆహ్వానిస్తున్నారు.
ఎవరెవరు.. ఏ దిశగా?
►బీఆర్‌ఎస్ టికెట్ దక్కని ఏడుగురు సిట్టింగ్‌లలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమైంది. మిగతా సిట్టింగ్‌లలో బాపూరావు రాథోడ్, తాటికొండ రాజయ్య, ఆత్రం సక్కు, రాములు నాయక్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటనలు చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ఒకరిద్దరు పునరాలోచనలో పడే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనుచరులు కాంగ్రెస్‌లోకి వెళ్దామంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
►వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ట్విట్టర్ వేదికగా అసంతృప్తి ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి రమేశ్ బాబాయి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావు పోటీచేసే అవకాశం ఉండటంతో.. ఆయనకు రమేశ్ మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
► ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు.
►పాలేరులో టికెట్ దక్కని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అనుచరులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై బీఆర్‌ఎస్‌ను వీడుదామంటూ విజ్ఞప్తి చేశారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న తుమ్మలను మంత్రి హరీశ్‌రావు కలసి పారీ్టతో కలసి సాగాలని కోరినట్టు సమాచారం.
►కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో బీజేపీ నాయకులు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. జనగామ టికెట్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకు టికెట్ లభించని పక్షంలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రెండు దఫాలుగా అక్కడ గెలిచిన ముత్తిరెడ్డి.. బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకుంటే బీజేపీవైపు అడుగు వేసే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు.
►నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
►రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసమ్మతి వ్యక్తం చేస్తూ, టికెట్ ఆశించిన పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు.
►పెద్దపల్లి టికెట్ ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా ప్రకటించడంతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు.
►వీరితోపాటు రామ్మోహన్‌గౌడ్ (ఎల్‌బీ నగర్), మన్నెం రంజిత్‌యాదవ్ (నాగార్జునసాగర్), బొమ్మెర రామ్మూర్తి (మధిర), మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నల్లాల ఆనంద్ (మానకొండూరు), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), శశిధర్‌రెడ్డి (కోదాడ) తదితరులతో విపక్షాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
►జహీరాబాద్‌లో టికెట్ ఆశించిన ఢిల్లీ వసంత్ ‘యుద్ధం మిగిలే ఉంది..’ అని ప్రకటన చేయగా.. పటాన్‌చెరు స్థానం ఆశించిన నీలం మధు ఈ నెల 24న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని వెల్లడించారు.
►మాజీ మంత్రి, మాజీ ఎంపీ గెడ్డం నగేశ్ బోథ్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
► సూర్యాపేటకు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జంగయ్యయాదవ్ కూడా.. మంత్రితో విభేదాల నేపథ్యంలో పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ‘ఆపరేషన్ అసంతృప్తులు’!
బీఆర్‌ఎస్‌లో టికెట్ రాని అసమ్మతులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. టికెట్‌రాని కీలక నేతలతోపాటు ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ‘ఆపరేషన్ అసంతృప్తులు’ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యరి్థత్వాలపై ఆ పార్టీ కేడర్‌లోనే వ్యతిరేకత ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో జనంలో ఉన్న వారెవరు? ఓట్లు వేయించగలిగిన వారెవరు? చేరిక అనంతరం పార్టీ ఇమేజ్‌కు దోహదపడేవారెవరు? బీఆర్‌ఎస్ అభ్యర్థులను గట్టిగా దెబ్బకొట్టగలిగేవారెవరు? తమ నాయకులకు ఇతోధికంగా దోహదపడే సమీకరణాలకు ఎవరు సరిపోతారు? అనే కోణాల్లో బీఆర్‌ఎస్ అసంతృప్తులను జల్లెడ పట్టి వెతికే పనిలో పడింది.
ఇప్పటికే చర్చలు మొదలు
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు రంగంలోకి దిగారని.. బీఆర్‌ఎస్ అసంతృప్తులతో చర్చలు జరిపి పారీ్టలోకి తీసుకువచ్చే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, జిల్లాల ముఖ్య నేతలకు అప్పగించారని తెలిసింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ నుంచి వేముల వీరేశం, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రాజయ్య, ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌లతో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులనూ ఆకర్షించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగినందున రాజకీయంగా తాము న్యాయం చేస్తామని.. తప్పకుండా టికెట్ ఇస్తామని.. లేదంటే పార్టీలో తగిన గౌరవం కలి్పస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలతో నిర్వహించే బహిరంగ సభల్లో ఈ చేరికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో 26న చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆధ్వర్యంలో జరగనున్న సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆమె భర్త శ్యాంనాయక్, మరికొందరు నేతలను చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment