కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ప్రకటించని కాంగ్రెస్
తీన్మార్ మల్లన్నను వ్యతిరేకిస్తున్న ప్రవీణ్ రెడ్డి వర్గం
ఇప్పటికే బీఆర్‌ఎస్– బీజేపీల మధ్య నాన్‌లోకల్ మాటల యుద్ధం
స్థానికేతరులకు ఇస్తే.. పనిచేసేది లేదంటున్న హస్తం కేడర్
అసెంబ్లీ తరహాలోనే ఆలస్యం చేస్తున్నారని మండిపాటు
త్వరలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కీలక నేతలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముందుగా అనుకున్న విధంగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కాకుండా తెరపైకి మరో రెండు కొత్త పేర్లు రావడంతో కేడర్ అయోమయంలో పడింది. ఇప్పటికే కరీంనగర్‌లో లోకల్ నాన్ లో కల్ అంటూ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మరో స్థానికేతరుడు తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే తాము పనిచేసే పరిస్థితి ఉండదని స్థానికనేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన హస్తం అధిష్టానం తెలంగాణలో ఎంతో కీలకమైన కరీంనగర్ ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానికేతరులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ప్రవీణ్‌రెడ్డి అభిమానుల గుస్సా
అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పార్టీ కోసం త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి అదే సమయంలో ఎంపీ సీటు ఇస్తామని అధిష్టానం మాటిచ్చింది. ప్రవీణ్‌రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పార్లమెంటు పరిధిలో ప్ర చార పోస్టర్లు వేసుకున్నారు. కానీ, అకస్మాత్తుగా తెరపైకి వెలి చాల రాజేందర్‌రావు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు.
ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రవీణ్‌రెడ్డి వర్గం కిమ్మనడం లేదు. ఇది చాలదన్నట్లుగా అదనంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేరును తెరపైకి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. దీంతో ప్రవీణ్‌రెడ్డి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజవకర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని, తమను కాదని ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావాల్సిన అగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే దూరమైన రోహిత్‌రావు
పార్టీ టికెట్ కోసం కొన్నేళ్లుగా ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్‌రావు కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం ఎంపీ ఎన్నికల సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.
తనకు టికెట్ రాకున్నా.. ప్రవీణ్‌రెడ్డి కోసం పనిచేసేందుకు రోహిత్‌రావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. తీరా ప్రవీణ్‌రెడ్డిని కాదని ఇంకెవరికి ఇచ్చినా రోహిత్‌రావు వర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారిని పోటీలోకి దింపడంపై జిల్లా కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
త్వరలో కాంగ్రెస్‌లోకి గులాబీ నేతలు
బీఆర్‌ఎస్ అధిష్టానానికి వరుసషాకులు తగులుతున్న వేళ.. కరీంనగర్ జిల్లా మాత్రం కంచుకోటలా ఉంటూ వస్తోంది. కొంతకాలంగా హస్తం పార్టీ నేతల లాబీయింగ్ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన కీలక గులాబీ నేతలు ఈనెల 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగే రాహుల్‌గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకోనున్నారని సమాచారం.
తెరపైకి మరో వ్యక్తి..
కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేందర్‌రావులతోపాటు మరో ఆసక్తికర వ్యక్తి పేరు వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోగానే అతన్నే ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఆసక్తిగా మారింది. ఒకవేళ అదే వాస్తవరూపం దాలిస్తే.. కరీంనగర్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
టికెట్ ప్రకటించిన పెద్దపల్లిలో అనిశ్చితే..
పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్ టికెట్ ఖరారైనా అనిశ్చితే నెలకొంది. గడ్డం కుటుంబానికి చెందిన వినోద్‌కుమార్ బెల్లంపల్లికి, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీగా ఆదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. మాదిగలు ఎక్కువగా ఉండే పెద్దపల్లి స్థానానికి మాదిగ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా గడ్డం వంశీకి టిక్కెట్ కేటాయించారని, పునరాలోచన చేయకపోతే వచ్చే నెల 5న న్యాయ దీక్ష చేస్తానంటూ యువజన జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో టికెట్ మార్పుపై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు రిజర్వ్‌డ్ స్థానాల్లోని పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లో మాల సామాజికవర్గానికి టికెట్ కేటాయించింది.
వరంగల్‌లో మాదిగ సామాజికవర్గంలోని ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికే టిక్కెట్ కేటాయించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ మార్పు చేస్తుందా? గడ్డం వంశీనే కొనసాగిస్తాందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. టికెట్ ఖరారు చేసుకున్న గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోకపోయినా.. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుతూ బలాన్ని పెంచుకుంటున్నారు..
ఇవి చదవండి: ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ కుట్ర : ఎమ్మెల్యే కవ్వంపల్లి
Comments
Please login to add a commentAdd a comment