బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు! | Congress MPs and defeated candidates disclosed to Kurien Committee | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు!

Published Fri, Jul 12 2024 5:04 AM | Last Updated on Fri, Jul 12 2024 5:04 AM

గురువారం రాత్రి పీజే కురియన్, రకీబుల్‌ హుస్సేన్‌ను సత్కరిస్తున్న సీఎం రేవంత్‌.  చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు

అందుకే మన సీట్లు తగ్గాయి... చేరికలు కూడా కలసి రాలేదు

ఇతర పార్టీల నేతలను అభ్యర్థులుగా దింపడమూ ఫలించలేదు 

కురియన్‌ కమిటీకి వెల్లడించిన కాంగ్రెస్‌ ఎంపీలు, ఓడిపోయిన అభ్యర్థులు 

బీజేపీపై బీఆర్‌ఎస్‌కు కోపం ఉండాలి కదా అని ప్రశ్నించిన కురియన్‌ 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారాయని చెప్పిన పార్టీ నేతలు 

నేడు కూడా కొనసాగనున్న పోస్టుమార్టం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కావడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన మేర సీట్లు రాలేదని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా కలసి రాలేదని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించేందుకు హైకమాండ్‌ పంపిన కురియన్‌ కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌తోపాటు అస్సాం ఎమ్మెల్యే రకీబుల్‌ హుస్సేన్‌ గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. 

మూడు రోజుల షెడ్యూల్‌లో భాగంగా తొలి రోజు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులతో వీరిరువురూ భేటీ అయ్యారు. 17 మంది అభ్యర్థులకుగాను 16 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న కారణంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమిటీ ముందుకు రాలేదు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, టీజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఫహీం, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ తదితరులు కూడా కురియన్‌ కమిటీని మర్యాదపూర్వకంగా కలిశారు.  

మొత్తం సీన్‌ మారిపోయింది... 
తొలి రోజు షెడ్యూల్‌లో భాగంగా ఉదయమే గాం«దీభవన్‌లో కురియన్‌ కమిటీ ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్‌ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, ఓడిపోయిన అభ్యర్థులు ఆత్రం సుగుణ, దానం నాగేందర్, సఫీవుల్లా, సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెల్చాల రాజేందర్‌రావు, చల్లా వంశీచందర్‌రెడ్డి, నీలం మధు, జీవన్‌రెడ్డిలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్టుగా జరిగిందని, కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్టుగా జరిగిందని వెల్లడించినట్టు తెలిసింది. ‘అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు లోక్‌సభ ఎన్నికల్లో లేవు. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. 

బీఆర్‌ఎస్‌ బాహాటంగానే బీజేపీకి మద్దతిచ్చింది. తాము గెలవకపోయినా కాంగ్రెస్‌ గెలవొద్దని, బీజేపీని గెలిపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను రక్షించుకోవాలనేది బీఆర్‌ఎస్‌ ఉద్దేశం’అని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కురియన్‌ బీజేపీ అంటే బీఆర్‌ఎస్‌కు కోపం ఉండాలి కదా... ఓట్లు వేసి సహకరించుకునే సాన్నిహిత్యం ఆ రెండు పార్టీల మధ్య ఉందా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మొదటి నుంచీ తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉండేదని, రాజకీయ క్షేత్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య వైరుధ్యం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం మారిపోయిందని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీకి సహకరించారని వెల్లడించారు. 

ఎమ్మెల్యేలు సహకరించలేదు... 
కొందరు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు ఎన్నికల్లో సహకరించని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల పేర్లను కూడా కురియన్‌ కమిటీకి చెప్పారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని, అక్కడ బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన డి.కె.అరుణ కాంగ్రెస్‌ నుంచి ఎదిగారని, దీంతో చాలా స్వల్పంగా అయినా కాంగ్రెస్‌ కేడర్‌ ఆమెకు సహకరించిందని, ఈ నియోజకవర్గంలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయలేదనే చర్చ జరిగినట్టు సమాచారం. 

అలాగే మెదక్‌ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో సహకారం అందలేన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి లాంటి నేతల చేరికలు పార్టీకి కలసి రాలేదని, వాళ్ల ఓట్లు కూడా పడలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వడం కూడా కొంత ప్రభావం చూపిందని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్‌ లాంటి స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం చివరి నిమిషం వరకు ఆగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వెల్లడైనట్లు తెలిసింది. కాగా, శుక్రవారం కమిటీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జులు, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ భేటీ కానుంది.  
వారి అంతర్గత పొత్తుతోనే: ఎంపీ చామల కిరణ్‌ 
కురియన్‌ కమిటీతో భేటీ అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను కురియన్‌ కమిటీకి వివరించామని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 12–13 స్థానాలు వచ్చేవని, బీజేపీ–బీఆర్‌ఎస్‌ల అంతర్గత పొత్తు కారణంగానే ఎనిమిది సీట్లకు పడిపోయామని చెప్పారు. కొన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల స్థాయి కంటే తక్కువ ఓట్లను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పొందిందని, పార్లమెంటు ఎన్నికల నాటికి సమీకరణాలు మారిపోయాయని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement