
ఆగస్టులో బీజేపీలో చేరిన నాటి దృశ్యం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు దాసోజు శ్రవణ్. బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం.
ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందంటూ లేఖలో దాసోజు పేర్కొన్నారు. దశ దిశ లేని రాజకీయ పరిణామాలకు బీజేపీ వేదిక అవుతోందని తన లేఖలో దాసోజు ఘాటుగా విమర్శించినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ను వీడి.. తరుణ్ చుగ్, కిషన్‌రెడ్డి, పలువురు కీలక నేతల సమక్షంలో బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆ సమయంలో తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
దాసోజు శ్రవణ్ పేరుతో వైరల్ అవుతున్న లేఖ
Comments
Please login to add a commentAdd a comment