సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ సైతం ఆయన పేరును మీడియా ముందు ప్రస్తావించారు కూడా.
దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో.. ఖైరతాబాద్ నేతల మధ్య పోటీ చల్లబడినట్లయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నల్లగొండకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్.. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ, టీ(బీ)ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పని చేసిన శ్రవణ్.. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరికతో ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టీ(బీ)ఆర్ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
ఆపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్‌ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment