daanam nagendar
-
బీఆర్ఎస్ స్ట్రాటజీ.. ఎమ్మెల్సీగా దాసోజు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ సైతం ఆయన పేరును మీడియా ముందు ప్రస్తావించారు కూడా. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో.. ఖైరతాబాద్ నేతల మధ్య పోటీ చల్లబడినట్లయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్.. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ, టీ(బీ)ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పని చేసిన శ్రవణ్.. తిరిగి బీఆర్ఎస్లో చేరికతో ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టీ(బీ)ఆర్ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
దానం బదులు.. పీఏ చంద్రశేఖర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరు?
బంజారాహిల్స్: బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలను నివారించి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశలో అధిష్టానం ఓ బృహత్తర పథకాన్ని ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏ గ్రూపు తగాదాలను నివారించాలని ఈ కార్యక్రమం తలపెట్టారో ఆ గ్రూపు తగాదాలతోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులెత్తేశారు. ► కొన్ని డివిజన్లలో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు పొసగక, మరికొన్ని డివిజన్లలో నేతల మధ్య విభేదాలు, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సానుకూల వాతావరణం లేకపోవడంతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదు. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లలో ఇప్పటిదాకా వాటి ఊసే ఎత్తడం లేదు. ► ఇప్పటి వరకు కొన్ని డివిజన్లలో జరిగిన ఆత్మీ య సమ్మేళనాలు అంతగా విజయవంతమైనట్లుగా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఆత్మీయ సమ్మేళనాలపై నియోజకవర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుండగా ఖైరతాబాద్‌లో ఈ సమ్మేళనం అంత ఉత్సాహంగా, సానుకూల వాతావరణంలో జరగలేదని మంత్రి కేటీఆర్‌కు నివేదికలు వెళ్లాయి. ఇంకా రెండు డివిజన్లలో నిర్వహించాల్సిన సమ్మేళనాలు అటకెక్కాయి. ► బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదు. ► జూబ్లీహిల్స్ డివిజన్లో మూడు, నాలుగు గ్రూపులు బీఆర్ఎస్లో వేరు కుంపట్లు పెట్టాయి. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే అంత తేలిక కాదని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి డివిజిన్‌లోనూ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ► ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటుండటంతో కార్యకర్తలు ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది. ► పార్టీ శ్రేణులు అన్నింటినీ కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యే దానం ఆ దిశలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ► నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అధిషానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఈ వర్గ విభేదాలు ఎన్నికల నాటికి సమసిపోకపోతే ఈ అవకాశాన్ని కాంగ్రెస్, బీజేపీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ కార్యకర్తలే వాపోతున్నారు. ఎమ్మెల్యే సారు బిజీగా ఉన్నారు... హిమాయత్‌నగర్: ‘ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ చాలా బిజీగా ఉన్నారు. అందుకే డివిజన్ పర్యటనకు నేను హాజరయ్యాను’ అని ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ అన్నారు. పీఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్థానికులు అవాక్కయ్యారు. బుధవారం హిమాయత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి నేతృత్వంలో జీహెచ్ఎంసీ ఈఈ పేర్రాజుతో కలసి పీఏ చంద్రశేఖర్ పర్యటించారు. స్ట్రీట్ నెంబర్–2లో డ్రైనేజీ సమస్య ఉండటంతో ఇక్కడ పైప్‌లైన్ మంజూరైంది. ఈ పైప్‌లైన్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పీఏకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో కరెంట్ పోల్‌ను రీప్లేస్ చేయాలని కోరారు. భగ్గీఖానా, స్ట్రీట్ నెంబర్–4లోని పూర్తిగా ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఈఈ పేర్రాజును పీఏ చంద్రశేఖర్ కోరారు. స్థానికులు, నాయకులు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే దానంకు వివరించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానంటూ పీఏ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం రావాల్సిన పర్యటనలో ఆయన పీఏ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. -
'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత'
తిరుమల: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వదిలి విదేశీ పర్యటనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత దానం నాగేందర్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. మోడీ నుంచి ప్రజలు ఎంతో ఆశీంచారని, కానీ ఆయన అనుకున్న విధంగా ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించారన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అధిక ధరలు పెరిగిపోయాయన్నారు. దీనివల్ల సామన్య ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.