సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఒక గవర్నర్ కోటా స్థానంతో పాటు మరో ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అవుతున్నాయి. ఓటమి భయం లేని... సురక్షిత స్థానాలైన వీటి ద్వారా శాసనమండలిలో అడుగుపెట్టాలని చాలామంది టీఆర్‌ఎస్ నేతలు ఆశిస్తున్నారు. మళ్లీ అవకాశాన్ని ఆశిస్తున్న సీనియర్లు, కొత్తగా మండలిలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న వారు కలిపితే ఈ జాబితా పెద్దగానే ఉంది.
గవర్నర్ కోటాలో శాసనమండలిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 16న ముగుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఆరుగురు సభ్యులు కూడా ఈ జూన్ 3న పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటారు. శాసన మం డలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంక టేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దిన్, ఆకుల లలిత ఈ ఆరుగురు.
జూన్‌లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్సీలు అందరూ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉండటం, పార్టీపరంగా కీలక నేతలు కావడంతో వీరిలో ఎంతమంది తిరిగి మండలిలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు కూడా ఎమ్మెల్యే కోటాలో శాసనమండలిలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంఖ్యాపరంగా శాసనసభలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఉండటంతో ఎమ్మెల్యే కోటా మండలి స్థానాలన్నీ తిరిగి టీఆర్‌ఎస్‌కే దక్కడం ఖాయం. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యే కోటాలో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా?
గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మండలికి ఎన్నికైన తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే పదవీ కాలం ముగుస్తుండటంతో గుత్తాకు మరోమారు అవకాశం ఇవ్వడంతో పాటు మండలి ఛైర్మన్‌గా కూడా కొనసాగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలో రెండో పర్యా యం అధికారంలోకి వచ్చినా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో మరోమారు కడియంకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై చివరి నిముషం వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. కడియంతో పాటు మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. కాబట్టి వీరిలో ఒక్కరికే తిరిగి అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
మైనారీటీ కోటాలో మాజీ మంత్రి ఫరీదుద్దిన్‌కు మరోమారు అవకాశం దక్కే సూచనలున్నా ఆకుల లలిత భవితవ్యంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. వయోభారం కారణంగా శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ అవకాశం లేకపోవడంతో సీఎం కార్యాల య ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిముషంలో కవి, గాయకుడు గోరటి వెంకన్నకు అవకాశం లభించింది. టీఎన్‌జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు, బ్రూ వరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
ఆశల పల్లకిలో ఆశావహులు
పార్టీలో ఉద్యమకాలం నుంచి కొనసాగుతున్న నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే కోటాలో త్వరలో ఖాళీ అయ్యే ఆరు ఎమ్మెల్సీ స్థానాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఓ వైపు జిల్లాలు, సామాజికవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటూ.. మండలిలో అడుగుపెట్టేందుకు ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుంటూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ సందర్భాల్లో అవకాశం దక్కని నేతలు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తారనే ధీమాతో ఉన్నారు.
శాసనసభ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుండు సుధారాణి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, నాగార్జునసాగర్‌లో టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, ఇటీవల హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి టికెట్ ఆశించిన పీఎల్ శ్రీనివాస్ తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment