ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సాగు చేసిన మొక్క
– సుభాష్‌పాలేకర్, రాష్ట్రమంత్రులు హాజరు
– 14 వరకూ రైతులకు శిక్షణ తరగతులు
– అన్ని జిల్లాల నుంచీ 6 వేల మంది రైతులు
– చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయి అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 14 వరకూ తిరుపతిలో రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులను నిర్వహించనుంది. జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై అనుభవం గడించిన సుభాష్ పాలేకర్ స్వయంగా హాజరై నాలుగు రోజుల పాటు రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. 11న ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సదస్సులను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులతో పంటలను పండించే విధానానికి స్వస్తి పలుకుతున్న రైతులు సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆహార ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, పండ్లను విరివిగా పండిస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, కాకినాడల్లో రెండు దఫాలుగా శిక్షణా తరగతులు నిర్వహించిన సుభాష్‌పాలేకర్ మూడో విడత తిరుపతిలో వీటి నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల్లో విస్తత పరచాలన్న ఆలోచనతో ప్రభుత్వం తరగతుల నిర్వహణ కోసం రూ.3 కోట్లను విడుదల చేసింది. జిల్లాకు 400 మంది రైతులు, శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. వీరందరూ తిరుపతి సదస్సుకు çహాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది.
కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాట్లు...
తిరుపతిలోని తనుపల్లె రోడ్డులో ఉన్న రామానాయుడు కల్యాణ మండపంలో వ్యవసాయ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈవో, వ్యవసాయశాఖ జేడీఏలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సదస్సుల నిర్వహణ కోసం ప్రభుత్వం వ్యవసాయ కమిషనరేట్‌లో డీడీగా పనిచేస్తోన్న భగవత్‌స్వరూప్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు తిరుపతి శిక్షణ తరగతులకు సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు.