nallamada
-
పాపం జంతువులు.. కాపాడుకోవాల్సిందే.. నల్లమలకు రక్షణ వలయం
నంద్యాల(రూరల్): జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచిన నల్లమల అటవీ సంరక్షణకు అధికారులు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఎంతో విలువైన వృక్ష, జంతు సంపదను కాపాడేందుకు నిఘా కట్టుదిట్టం చేశారు. నంద్యాల జిల్లాలో 3.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా నల్లమల అడవి 2.30 లక్షల హెక్టార్ల విస్తరించడం విశేషం. కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఉంది. కాగా సమీప గ్రామాల్లో కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకొని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణతులు, కుందేళ్లు, అడవి పందులకు రాత్రి వేళ ఉచ్చులేసి వేటాడుతున్నారు. ఈ ఉచ్చుల్లో ఒక్కోసారి పెద్దపులులు, చిరుతలు పడి మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో అటవీ అధికారులు నల్లమల చుట్టూ గస్తీ ముమ్మరం చేసి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ శాఖ పరిధిలోని నల్లమల అటవీకి సంబంధించి 10 రేంజ్ కార్యాలయాలు (బండిఆత్మకూరు, గుండ్లబ్రహ్మేశ్వరం, నంద్యాల, చెలిమ, రుద్రవరం, శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగాటూరు) ఉన్నాయి. వీటి పరిధిలో 10 మంది రేంజ్ అధికారులు, 8 మంది డిప్యూటీ రెంజ్ అధికారులు, 36 మంది సెక్షన్ అధికారులు, 76 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు ఆభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏ మాత్రం కదలికలు కనిపించినా అదుపులోకి విచారిస్తున్నారు. మరో వైపు కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఏ మాత్రం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం పరిధిలో ఏడాది కాలంలో 38 మంది వేటగాళ్లను అరెస్టు చేసి, దాదాపు 5.04 లక్షల అపరాధ రుసుం విధించారు. రుద్రవరం పరిధిలో 9 కేసుల్లో 11 మంది, శిరివెళ్ల పరిధిలో 6 కేసుల్లో 8 మంది, మహానంది పరిధిలో 2 కేసుల్లో ఆరుగరు, బండిఆత్మకూరు పరిధిలో 2 కేసుల్లో ఒకరిని, వెలుగోడు పరిధిలో 4 కేసుల్లో ఐదుగురిని, ఆత్మకూరు పరిధిలో 5 కేసుల్లో ముగ్గురిని, చాగలమర్రి పరిధిలో 4 కేసుల్లో నలుగురిని అరెస్టు చేశారు. జిల్లాలోని నల్లమల అటవీ శాఖ పరిధిలో మొత్తం 32 కేసుల్లో 38 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రాత్రి వేళ అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎర్రచందనం దొంగలకు చెక్.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎర్రచందనం యథేచ్ఛగా తరలిపోయింది. గత పాలకుల అండతో ఎర్రచందనం ముఠా పెట్రేగిపోయింది. నల్లమలలో చాగలమర్రి, రుద్రవరం రేంజ్ పరిధిలో విస్తారంగా ఉండే ఎర్ర చందనం దుంగలను విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎర్రచందనం దొంగల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో ఎర్రచందనం దొంగలు అటవీలోకి అడుగు పెట్టలేకపోతున్నారు. అటవీ అధికారుల రక్షణ వలయం దాటేందుకు జంకుతున్నారు. నల్లమల పరిధిలో ముఖ్య ఘటనలు.. ● గత నెల 9వ తేదీ వెలుగోడు అటవీశాఖ పరిధిలో జింకలను వేటాడానికి వెళ్లిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ● ఆళ్లగడ్డ మండల పరిఽధిలో 2022 మే 21వ తేదీన 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని 11 మందిని అరెస్టు చేశారు. ● రుద్రవరం రేంజ్ పరిధిలో 2022 జూన్ 13వ తేదీన పులిని చంపి చర్మాన్ని విక్రయించిన ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు. ● మహానంది అటవీ రేంజ్ పరిధిలో గతేడాది రూ. లక్షలు విలువ చేసే వెదురు బొంగులలను అక్రమంగా తరలిస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ● గతేడాది ఆగస్టులో అటవీ నుంచి దారి తప్పి వచ్చిన రెండు దుప్పిలను బంధించిన ఓ వ్యక్తిని మహానంది రేంజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ● తొమ్మిది నెలల క్రితం ఆళ్లగడ్డ మండలం బీచ్పల్లె సమీపంలో విషపు ఆహారం తిని ఒక ఎలుగుబంటి మృతి చెందటంతో అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు!
పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. చదువుల్లో టాప్.. గణేష్ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్ తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. క్రికెట్ అంటే మక్కువ.. గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. గణేష్ సాధించిన విజయాలు 2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు. 2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
పెళ్లై మెట్టినింటికి వెళ్లిన యువతికి ఫోన్ చేసి కోరిక తీర్చాలంటూ..
సాక్షి, నల్లమాడ (అనంతపురం): వివాహితను లైంగికంగా వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ యల్లంరాజు గురువారం రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. దొన్నికోటకు చెందిన గిరిజన యువతి గతంలో వైఎస్సార్ జిల్లా రాయచోటిలోని ఆస్పత్రిలో పనిచేసింది. ఆ సమయంలో అక్కడే పనిచేసిన యల్లనూరు మండలం కల్లూరుకు చెందిన నవీన్‌తో పరిచయమైంది. ఆరు నెలల క్రితం యువతికి కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి మండలం ఎం.చెర్లోపల్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఆస్పత్రిలో పనిచేస్తున్నపుడు ఏర్పడిన పరిచయాన్ని ఆసరా చేసుకున్న నవీన్.. పెళ్లై మెట్టినింటికి వెళ్లిన యువతికి ఫోన్ చేసి కోరిక తీర్చాలంటూ వేధించేవాడు. భర్తకు విషయం తెలియడంతో ఆమెను పుట్టింటికి పంపించేశాడు. నవీన్ నుంచి తనను, కుటుంబాన్ని కాపాడి, కాపురాన్ని నిలబెట్టాలని ఓ వీడియో ద్వారా కలెక్టర్, ఎస్పీలను కోరింది. ఈ వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేసి, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కదిరి డీఎస్పీ విచారణ చేయాల్సి ఉంది. కాగా బాధిత యువతి బుధవారం ఎస్పీ ఫక్కీరప్పను కూడా కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..) -
మాన్యం భూములపై స్వార్థపరుల కన్ను
నల్లమాడ: పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందేందుకు కొందరు స్వార్థపరులు అక్కదేవతల మాన్యాన్ని కైవసం చేసుకునటి పట్టాలు చేయించుకున్నారు. మండల పరిధిలోని సోమగుట్టపల్లి వద్ద నల్లమాడ రెవెన్యూ పొలం సర్వే నంబర్ 963లో 30 ఎకరాల పైబడి విస్తీర్ణం ఉంది. ఇందులో కొంత పట్టా భూమి ఉండగా.. అధికశాతం బండ, రాళ్లకుప్పలు ఉన్నాయి. ఇక్కడే అక్కదేవతల గుడి కూడా ఉంది. తమ పూర్వీకులు అక్కమ్మ గారి మాన్యం కింద గుట్టను వదిలేసినట్లు గ్రామస్తులు చెబుతుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తరము కట్టని గయ్యాళిగా నమోదై ఉంది. స్వార్థపరుల కన్ను: రెవెన్యూ రికార్డుల్లో ఒకేచోట 30 ఎకరాలు గయ్యాళి భూమి ఉండటాన్ని పసిగట్టిన కొందరు స్వార్థపరులు దానిపై కన్నేశారు. అధికారం, పలుకుబడి, హోదాతో రెవెన్యూ అధికారులను లోబర్చుకొని నల్లమాడకు చెందిన కొందరు 17.10 ఎకరాలను వన్‌బీ, అడంగల్‌లో తమ పేరున నమోదు చేయించుకున్నారు. వన్‌బీ ఆధారంగా బ్యాంకుల్లో పంటరుణాలు పొంది, పంటనష్ట పరిహారం, బీమా స్వాహా చేస్తున్నారు. ఇందులో అధికార టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నాయకుడూ ఉన్నారు. తాతల కాలం నుంచి సాగుచేసుకొంటున్న పట్టా భూమిని కూడా వీరు కాజేయడంతో తాము నష్టపోతున్నామని గ్రామానికి చెందిన కొందరు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టకు పట్టాలు ఎలా ఇస్తారు? సర్వే నంబర్ 963లో సాగుభూమి లేకపోగా గుట్టకు అధికారులు పట్టా ఎలా ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్కదేవతల మాన్యం కింద వదిలేయడంతో సాగుభూమి తయారు చేసుకునేందుకు అవకాశం ఉన్నా తాము అందులో ప్రవేశించలేదని తెలిపారు. పశువులను మేత కోసం గుట్టలో తోలుతుంటామని, ఎవరికో పట్టాలు ఇస్తే తాము పశువులను ఎక్కడ మేపాలని నిలదీస్తున్నారు. మామూళ్లకు ఆశపడి అధికారులు ఇతరులకు పట్టాలు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషా దృష్టికి తీసుకెళ్లగా తరము కట్టని గయ్యాళి విస్తీర్ణంలో ఇతరులకు హక్కు కల్పించిన విషయం తనకు తెలియదని, గ్రామస్తులు ఫిర్యాదు అందజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కన్నీటి సేద్యం
నల్లమాడ: ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నీరు కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరా పంటకు ట్యాంకర్ నీరు అవసరం. ట్యాంకు నీరు రూ.600 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులకు ఓసారైనా పంటలను తడపాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఐదారు ఎకరాలు పంట సాగు చేసిన రైతులు నీటి కొనుగోలుకు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, నాయకులు స్పందించి వేరుశనగ, కంది పంటలకు రక్షక తడులు అందించాలని రైతులు కోరుతున్నారు. అయితే వర్షాభావంతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రక్షక తడుల ద్వారా పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రైతులకు న్యాయం జరగపోతే ఉద్యమం
నల్లమాడ: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులోనూ ప్రభుత్వ ‘పచ్చ’పాత వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన వారికి ఎకరా భూమి ఉన్నా రూ.40 వేలు పరిహారం మంజూరు చేసిన పాలకులు, ఇతర రైతులు ఐదెకరాలు పైబడి పంటలు సాగు చేసి నష్టపోయినా రూ.500 మాత్రమే మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదలలో అక్రమాలను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ధర్నాలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను భయపెట్టి ఇన్పుట్ సబ్సిడీ జాబితాను తమకు ఇష్టం వచ్చినట్లు తయారు చేయించారని ఆరోపించారు. తప్పొప్పులను సరిదిద్ది 10 రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ విస్తీర్ణం మేరకు పరిహారం మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులెవ్వరినీ గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఓడీ చెరువు, అమడగూరు, బుక్కపట్నం మండలాల కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, శేషురెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ కన్వీనర్ పొరకల రమణ, సర్పంచ్‌లు రంగలాల్‌నాయక్, సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి చంద్ర, ఎమ్మార్పీఎస్ గంగిశెట్టి, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి ఆది, బీడుపల్లి శ్రీధర్, పలువురు రైతులు మాట్లాడారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ఏఎస్ హమీద్బాషాకు అందజేశారు. -
ఇళ్ల మధ్య మద్యం దుకాణం సరికాదు
నల్లమాడ : నివాస గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మహిళలు తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక గంగా సినిమా థియేటర్ కూడలిలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు చంద్ర, గోవిందు వారికి మద్దతు పలికారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎదురయ్యే సమస్యలను తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషాకు మహిళలు విన్నవించారు. వారి సమస్యను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషా హామీ ఇచ్చారు. పుట్టపర్తి ఎక్సైజ్ సీఐ భీమలింగ, స్థానిక ఎస్ఐ కె.గోపీ, ఆర్ఐలు శ్రీధర్, నాగరాజు, ఆర్డీటీ ఏటీఎల్ రామాంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి గోవిందు, మహిళలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఊరు ఖాళీ.
-
ఉగాది కోసం ఊరికొస్తే ఊపిరి పోయింది!
నల్లమాడ(అనంతపురం): ఉగాది పర్వదినాన్ని స్వగ్రామంలో బంధువులు, గ్రామస్తుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చిన ఓ కూలీని వడదెబ్బ రూపంలో మృత్యువు అతని ఉసురు తీసింది. ఈ విషాద సంఘటన నల్లమాడ మండలం పోలంవాండ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఎం.బయపరెడ్డి(55) అనే రైతు కూలీ వడదెబ్బ బారిన పడి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. వారి సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన నీలమ్మ, బయపరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తె భారతికి వివాహమైంది. బయపరెడ్డికి నాలుగెకరాల సాగు భూమి ఉంది. మూడు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో భూమిని బీడుగా వదిలేసి కుటుంబమంతా వలస వెళ్లారు. పెద్ద కుమారుడు నరేంద్రరెడ్డి గోరంట్లలో చేనేత కార్మికుడిగా పని చేస్తుండగా, చిన్న కుమారుడు వేణుగోపాల్‌రెడ్డితో కలసి తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ బయపరెడ్డి చిన్నచితకా పనులకు వెళ్లేవాడు. ఉగాది పండుగకు ఇల్లు పూయాలంటూ నీలమ్మ భర్త బయపరెడ్డితో కలసి శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చిన బయపరెడ్డి గ్రామంతో పాటు సి.బడవాండ్లపల్లి, సి.రెడ్డివారిపల్లి, చారుపల్లిలోని బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలుకరించి రాత్రి 7.30 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల నొప్పి ఎక్కువగా వస్తోందంటూనే వెంటనే వాంతి చేసుకొని కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు. అధికారుల ఆరా ఈ విషయం తెలియగానే నల్లమాడ తహసీల్దార్ ఏఎస్ అబ్దుల్‌హమీద్ బాషా, ఆర్ఐ నాగరాజు తమ సిబ్బందితో కలసి పోలంవాండ్లపల్లికి శుక్రవారం చేరుకొన్నారు. బయపరెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బయపరెడ్డి అధికారులను కోరారు. -
20 మంది కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
నల్లమాడ (పుట్టపర్తి) : మండల కేంద్రం నల్లమాడలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక 17 మంది విద్యార్థినులు కడుపునొప్పితో విలవిలలాడినట్లు, మరో ముగ్గురు వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. సమీపంలో నివాసం ఉండే ఏఎన్ఎం ప్రమీల సమాచారం అందుకుని మరో ఏఎన్ఎం అరుణ, ఆశ కార్యకర్తలు వనజ, రమణమ్మలతో కలసి విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు. ఉడకని చారు తినడం వల్లే.. సరిగా ఉడకని వెజిటబుల్ కర్రీ (చారు) తినడం వల్లే విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు అయినట్లు మండల వైద్యాధికారి బాబ్జాన్ తెలిపారు. డాక్టర్‌తో పాటు సీహెచ్ఓ రామచంద్రారెడ్డి శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరీక్షించి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్, సీహెచ్‌ఓలు కూరగాయలను పరిశీలించారు. నాసిరకంగా ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట మనుషులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సూపర్వైజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
8 మంది డీలర్లకు జరిమానా
నల్లమాడ (పుట్టపర్తి) : మండలంలో బుధవారం నిత్యావసర సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ మిషన్లు ఓపెన్ చేయని ఎనిమిది మంది చౌకదుకాణాల డీలర్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు కదిరి ఆర్డీఓ వెంకటేశు తెలిపారు. నల్లమాడ, కుటాలపల్లి, చెరువువాండ్లపల్లి, సీ బడవాండ్లపల్లి, చారుపల్లి, కొండకిందతండా, వంకరకుంట గ్రామాల్లోని 3, 6, 23, 24, 30, 35, 36, 38 షాపు నంబర్ల డీలర్లకు జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకముందు కూడా మిషన్లు ఓపెన్ చేయకపోతే రోజుకు రూ. వెయ్యి చొప్పున జరిమానా పెంచుతామని ఆర్డీఓ హెచ్చరించారు. సాంకేతిక లోపం కారణంగా క్యాస్‌లెస్ కింద మిషన్లు ఓపెన్ కాలేదన్న డీలర్ల వాదనను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లగా క్యాస్‌లెస్ కింద మిషన్లు ఓపెన్ కానిపక్షంలో క్యాస్ తీసుకొని సరుకులు పంపిణీ చేయాలని తాము ఆదేశించామన్నారు. -
కాలువలు పూర్తికాకనే నీరెలా ఇస్తారు?
వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నల్లమాడ: ‘పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకు నీరు విడుదల చేయాలంటే మూడు రైల్వే క్రాసింగ్‌ల్లో బ్రిడ్జిలు నిర్మించి కాలువ తవ్వాల్సి ఉంది. బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి తీసుకోలేదు. చెరువు ముంగిట ఉన్న పెద్దకమ్మవారిపల్లి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండానే నీటి విడుదల ఎలా సాధ్యమని’ వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెరువుల్లో పూడిక తీస్తేనే నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పిల్లకాల్వలు తవ్వకుండా నీరు విడుదల చేసినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. రూ.100 కోట్ల తెల్లధనం, భారీగా బంగారు నిల్వలతో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా చంద్రబాబు నియమించారంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో విచారణాధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ రాయడం ద్వారా పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు కారణమయ్యారని, ఫలితంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో రోజుకో డిజైన్ మారుస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
శభాష్ రాధమ్మ!
ఇటు కుందేళ్ల పెంపకం...అటు వ్యవసాయం చేతినిండా ఆదాయం.. పలువురికి ఉపాధి నల్లమాడ : నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ... గ్రామ సమీపంలోని తమ పొలంలో ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించి రెండేళ్లుగా కుందేళ్ల పెంపకం చేపట్టారు. 200 కుందేళ్లతో ప్రారంభమైన ఈ ప్రకియ ప్రస్తుతం రెండు వేలకు చేరుకుంది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని ఆమె సాగు చేస్తున్నారు. దీంతో పాటు దాణాగా దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్కపొడిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు కూలీలను ఏర్పాటు చేసుకుని వారికి నెలకు రూ. 20 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. దినసరి కూలీల ఖర్చు ఇందుకు అదనం. మహానగరాలకు ఎగుమతి... మాంసానికి ఉపయోగపడే కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని రాధమ్మ పేర్కొంటున్నారు. ప్రస్తుతం కుందేలు మాంసం కిలో రూ. 580 వరకు అమ్ముడు పోతోందని, డిమాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై మాంసం సరఫరా చేస్తుంటామన్నారు. ఆయా నగరాల్లో బహిరంగ మార్కెట్ సౌకర్యం కూడా ఉందన్నారు. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ. రెండు లక్షలు రాబడి వస్తోందని, ఇందులో దాణా కొనుగోలు, కూలీల వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.లక్ష ఖర్చు అవుతుందని వివరించారు. షెడ్డు నిర్మాణం, కుందేలు పిల్లల కొనుగోలు, వాటి పోషణకు అవసరమైన జాలరీలు, బోరు ఏర్పాటు కోసం సుమారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టామన్నారు. ఆడ కుందేలు నెలకోమారు 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, ఈ విధంగా తక్కువ కాలంలోనే కుందేళ్ల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుందన్నారు. కుందేలు పిల్లలను నాలుగు మాసాలు పోషిస్తే రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతాయని, అప్పుడు వాటి మాంసాన్ని విక్రయిస్తామన్నారు. పాడితోనూ లబ్ధి తమకున్న పదెకరాలల్లో మూడు బోర్లు వేయించిన రాధమ్మ... కూలీలతో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమనూ చేపట్టారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూలీల సాయంతో 10 గేదెలను పోషిస్తూ పాల విక్రయం ద్వారా ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో సెలవు రోజుల్లో మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారని, తక్కిన సమయంలో తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటానని రాధమ్మ తెలిపారు. కుమార్తె చదువు కోసం నల్లమాడలో కాపురముంటున్న రాధమ్మ ప్రతిరోజూ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో రాకపోకలు సాగిస్తుంటారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం
= ఆటోను, పాదచారులను ఢీకొన్న వైనం = వీఆర్ఏతో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు నల్లమాడ: ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ఆటోను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. మంగళవారం సాయంత్రం నల్లమాడ నుంచి చౌటకుంటపల్లికి ప్రయాణికులతో ఆటో బయల్దేరింది. బస్టాండ్ కూడలి సమీపాన బ్రిడ్జిపైకి రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన శ్రీబాలాజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న చౌటకుంటపల్లికి చెందిన వీఆర్ఏ సికిందర్, వెంకటనర్సమ్మ, ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనసూయమ్మ, తండాకు చెందిన సాకమ్మ తీవ్రంగా గాయపడ్డారు. సంతకొచ్చి నడుచుకుంటూ వెళుతున్న బాసంవారిపల్లికి చెందిన రామక్క, పెమనకుంటపల్లికి చెందిన ఈశ్వరమ్మలను కూడా ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఎస్ఐ గోపీ తమ సిబ్బందితో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్, సర్పంచ్ రంగలాల్‌నాయక్, పంచాయితీ కార్యదర్శి శంకరనాయుడు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించండి: ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమీప బంధువులకు చెందిన స్కూల్ బస్సు కావడంతో కేసు తారుమారయ్యే అవకాశముందున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నల్లమడ అభివృద్ధికి రూ.240 కోట్లు
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి ప్రత్తిపాడు: నల్లమడ వాగు అభివృద్ధికి ’240 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమడ వాగు పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. వరద పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు డీపీవో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. వరదసహాయక చర్యల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. నల్లమడ మూడు నియోజకవర్గాల్లో నుంచి వెళుతుందని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రతిపాదనలు తయారు చేశారంటూ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డ్రెయినేజీ అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పూర్తి వివరాలతో అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారన్నారు. సమావేశంలో నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, వివిధ విభాగాల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
కస్తూరిబా గిరిజన బాలికల పాఠశాలలో తాగునీటి ఎద్దడి
నల్లమాడ: స్థానిక కస్తూర్భా గిరిజన బాలికల పాఠశాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమయింది. పాఠశాల్లో 6వ తరగతి నుంచి 10 వరకు 200 మంది విద్యార్థినులు ఉన్నారు. సంవత్సరం నుంచి తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థినిలు, వంట మనుషులు వాపోయారు. పాలకులకు, అధికారులను పలుమార్లు తెలియజేసినా ప్రయోజనం లేదన్నారు. పిల్లల స్నానం, దుస్తులు శుభ్రం చేసుకోవడానికి, బాత్రూంకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. ర క్షిత నీటి పథకంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రావడం లేదన్నారు. బయట నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నట్లు చెప్పారు. పాలకులు, అధికారులు స్పందించి తాగు నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పాఠశాల ఎస్ఓ వెంకటరమణమ్మను తాగునీటి సమస్యపై వివరణ కోరగా పాఠశాల ఆవరణలోని బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.