నంద్యాల(రూరల్): జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచిన నల్లమల అటవీ సంరక్షణకు అధికారులు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఎంతో విలువైన వృక్ష, జంతు సంపదను కాపాడేందుకు నిఘా కట్టుదిట్టం చేశారు.
నంద్యాల జిల్లాలో 3.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా నల్లమల అడవి 2.30 లక్షల హెక్టార్ల విస్తరించడం విశేషం. కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఉంది. కాగా సమీప గ్రామాల్లో కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు.
గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకొని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణతులు, కుందేళ్లు, అడవి పందులకు రాత్రి వేళ ఉచ్చులేసి వేటాడుతున్నారు. ఈ ఉచ్చుల్లో ఒక్కోసారి పెద్దపులులు, చిరుతలు పడి మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.
దీంతో అటవీ అధికారులు నల్లమల చుట్టూ గస్తీ ముమ్మరం చేసి రక్షణ వలయం ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ శాఖ పరిధిలోని నల్లమల అటవీకి సంబంధించి 10 రేంజ్ కార్యాలయాలు (బండిఆత్మకూరు, గుండ్లబ్రహ్మేశ్వరం, నంద్యాల, చెలిమ, రుద్రవరం, శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగాటూరు) ఉన్నాయి.
వీటి పరిధిలో 10 మంది రేంజ్ అధికారులు, 8 మంది డిప్యూటీ రెంజ్ అధికారులు, 36 మంది సెక్షన్ అధికారులు, 76 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు ఆభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏ మాత్రం కదలికలు కనిపించినా అదుపులోకి విచారిస్తున్నారు.
మరో వైపు కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఏ మాత్రం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం పరిధిలో ఏడాది కాలంలో 38 మంది వేటగాళ్లను అరెస్టు చేసి, దాదాపు 5.04 లక్షల అపరాధ రుసుం విధించారు.
రుద్రవరం పరిధిలో 9 కేసుల్లో 11 మంది, శిరివెళ్ల పరిధిలో 6 కేసుల్లో 8 మంది, మహానంది పరిధిలో 2 కేసుల్లో ఆరుగరు, బండిఆత్మకూరు పరిధిలో 2 కేసుల్లో ఒకరిని, వెలుగోడు పరిధిలో 4 కేసుల్లో ఐదుగురిని, ఆత్మకూరు పరిధిలో 5 కేసుల్లో ముగ్గురిని, చాగలమర్రి పరిధిలో 4 కేసుల్లో నలుగురిని అరెస్టు చేశారు.
జిల్లాలోని నల్లమల అటవీ శాఖ పరిధిలో మొత్తం 32 కేసుల్లో 38 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రాత్రి వేళ అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఎర్రచందనం దొంగలకు చెక్..
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎర్రచందనం యథేచ్ఛగా తరలిపోయింది. గత పాలకుల అండతో ఎర్రచందనం ముఠా పెట్రేగిపోయింది. నల్లమలలో చాగలమర్రి, రుద్రవరం రేంజ్ పరిధిలో విస్తారంగా ఉండే ఎర్ర చందనం దుంగలను విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎర్రచందనం దొంగల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో ఎర్రచందనం దొంగలు అటవీలోకి అడుగు పెట్టలేకపోతున్నారు. అటవీ అధికారుల రక్షణ వలయం దాటేందుకు జంకుతున్నారు.
నల్లమల పరిధిలో ముఖ్య ఘటనలు..
● గత నెల 9వ తేదీ వెలుగోడు అటవీశాఖ పరిధిలో జింకలను వేటాడానికి వెళ్లిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
● ఆళ్లగడ్డ మండల పరిఽధిలో 2022 మే 21వ తేదీన 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని 11 మందిని అరెస్టు చేశారు.
● రుద్రవరం రేంజ్ పరిధిలో 2022 జూన్ 13వ తేదీన పులిని చంపి చర్మాన్ని విక్రయించిన ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు.
● మహానంది అటవీ రేంజ్ పరిధిలో గతేడాది రూ. లక్షలు విలువ చేసే వెదురు బొంగులలను అక్రమంగా తరలిస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
● గతేడాది ఆగస్టులో అటవీ నుంచి దారి తప్పి వచ్చిన రెండు దుప్పిలను బంధించిన ఓ వ్యక్తిని మహానంది రేంజ్ అధికారులు అరెస్ట్ చేశారు.
● తొమ్మిది నెలల క్రితం ఆళ్లగడ్డ మండలం బీచ్‌పల్లె సమీపంలో విషపు ఆహారం తిని ఒక ఎలుగుబంటి మృతి చెందటంతో అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment