కన్నీటి సేద్యం
నల్లమాడ: ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నీరు కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరా పంటకు ట్యాంకర్ నీరు అవసరం. ట్యాంకు నీరు రూ.600 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులకు ఓసారైనా పంటలను తడపాల్సి ఉందని రైతులు చెబుతున్నారు.
ఈ లెక్కన ఐదారు ఎకరాలు పంట సాగు చేసిన రైతులు నీటి కొనుగోలుకు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, నాయకులు స్పందించి వేరుశనగ, కంది పంటలకు రక్షక తడులు అందించాలని రైతులు కోరుతున్నారు. అయితే వర్షాభావంతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రక్షక తడుల ద్వారా పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.