కుంటి సాకులతో ధాన్యాన్ని వెనక్కి పంపుతున్నారు
దళారులకు బస్తా రూ.1,300 నుంచి రూ.1400కు అమ్ముకోవాల్సిన దుస్థితి
ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు
మంత్రి నాదెండ్ల ఎదుట సమస్యలను ఏకరవు పెట్టిన రైతులు
గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తుపాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు.
ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూరు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రభుత్వం తరఫున రైతుల దగ్గరకు ఏ అధికారీ రాలేదని, తనతో పాటుగా ఇక్కడి రైతులంతా బస్తా రూ.1300 నుంచి రూ.1400కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్‌ఎస్‌కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారులకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు.
మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రోజుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment