రైతులకు న్యాయం జరగపోతే ఉద్యమం
నల్లమాడ: ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరులోనూ ప్రభుత్వ ‘పచ్చ’పాత వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన వారికి ఎకరా భూమి ఉన్నా రూ.40 వేలు పరిహారం మంజూరు చేసిన పాలకులు, ఇతర రైతులు ఐదెకరాలు పైబడి పంటలు సాగు చేసి నష్టపోయినా రూ.500 మాత్రమే మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలలో అక్రమాలను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ధర్నాలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను భయపెట్టి ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాను తమకు ఇష్టం వచ్చినట్లు తయారు చేయించారని ఆరోపించారు. తప్పొప్పులను సరిదిద్ది 10 రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ విస్తీర్ణం మేరకు పరిహారం మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులెవ్వరినీ గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఓడీ చెరువు, అమడగూరు, బుక్కపట్నం మండలాల కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, శేషురెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ కన్వీనర్ పొరకల రమణ, సర్పంచ్‌లు రంగలాల్‌నాయక్, సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి చంద్ర, ఎమ్మార్పీఎస్ గంగిశెట్టి, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి ఆది, బీడుపల్లి శ్రీధర్, పలువురు రైతులు మాట్లాడారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ఏఎస్ హమీద్‌బాషాకు అందజేశారు.