నల్లమడ అభివృద్ధికి రూ.240 కోట్లు
నల్లమడ అభివృద్ధికి రూ.240 కోట్లు
Published Sat, Sep 24 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి
ప్రత్తిపాడు: నల్లమడ వాగు అభివృద్ధికి ’240 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమడ వాగు పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. వరద పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు డీపీవో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. వరదసహాయక చర్యల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. నల్లమడ మూడు నియోజకవర్గాల్లో నుంచి వెళుతుందని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రతిపాదనలు తయారు చేశారంటూ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డ్రెయినేజీ అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పూర్తి వివరాలతో అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారన్నారు. సమావేశంలో నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, వివిధ విభాగాల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Advertisement