- వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
నల్లమాడ: ‘పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకు నీరు విడుదల చేయాలంటే మూడు రైల్వే క్రాసింగ్‌ల్లో బ్రిడ్జిలు నిర్మించి కాలువ తవ్వాల్సి ఉంది. బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి తీసుకోలేదు. చెరువు ముంగిట ఉన్న పెద్దకమ్మవారిపల్లి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండానే నీటి విడుదల ఎలా సాధ్యమని’ వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెరువుల్లో పూడిక తీస్తేనే నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పిల్లకాల్వలు తవ్వకుండా నీరు విడుదల చేసినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. రూ.100 కోట్ల తెల్లధనం, భారీగా బంగారు నిల్వలతో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా చంద్రబాబు నియమించారంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో విచారణాధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ రాయడం ద్వారా పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు కారణమయ్యారని, ఫలితంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో రోజుకో డిజైన్ మారుస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు.