అత్తారింటి ఎదుట కోడలి దీక్ష
హిందూపురం అర్బన్ : నాలుగేళ్లు కాపురం చేసిన కోడలును ఇంట్లోకి రానివ్వకుండా అత్తమామలు అడ్డుకోవడంతో బాధితురాలు పోరాటానికి దిగింది. ఈ సంఘటన హిందూపురం హస్నాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఇదే మండలం కొటిపి గ్రామానికి చెందిన రాధమ్మను హిందూపురంలో టీవీ మెకానిక్‌గా పని చేస్తున్న ప్రభాకర్‌తో వివాహమైంది. నాలుగేళ్లు వారి సంసారం సాఫీగా సాగింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. నెల రోజుల కిందట పుట్టింటికి వెళ్లి రమ్మంటూ మామ ఆంజనేయులు చెప్పడంతో ఆమె సరేనని వెళ్లింది. నాలుగు రోజుల కిందట తిరిగి అత్తారింటికి వచ్చిన రాధమ్మను భర్త ప్రభాకర్ గొడవకు దిగాడు.
ఇంట్లోకి రావద్దనడంతో ఆమె నేరుగా రూరల్ æపోలీసుస్టేషన్‌కు వెళ్లి అత్తమామ సహా భర్తపై ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి రాగా వారు ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో గేటు వద్ద బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పింది. రాధమ్మను భర్త తరచూ వేధింపులకు గురి చేసేవాడని ఇరుగుపొరుగు వారు కూడా ఆరోపించారు. పిల్లలు పుట్టలేదన్న సాకుతో తనను వదలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఆమెను పోలీసుస్టేషన్‌కు పిల్చుకెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. ఆమె నిరసంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అత్తమామలు, భర్తను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.