రాధమ్మ వండిన వంట తినరంట!
బెంగళూరు: ఇప్పటికే వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ఆ బడిలో చదువుతున్నా.. అందులో ఐదుగురే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అందుకు కారణం రాధమ్మ మధ్యాహ్న భోజనాన్ని వండటమే. రాధమ్మ దళిత మహిళ కావడంతో ఆమె వండిన వంటను తినడానికి విద్యార్థులు నిరాకరిస్తున్నారు.
ఆమె వండిన మధ్యాహ్న భోజనాన్ని తినలేమంటూ మరో పాఠశాలలో వెళ్లి చేరుతున్నారు. ఇది కర్ణాటక కొలార్ జిల్లాలోని కగ్గనహళ్లి గ్రామంలో మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి. ఈ అనాగరిక పరిస్థితిపై పాఠశాల కూక్ రాధమ్మ విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. '2014 ఫిబ్రవరిలో నేను పాఠశాలలో చేరిననాటినుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నేను ఇచ్చిన పాలు కూడా విద్యార్థులు తాగరు. నేను వండిన వంటను తినరు. వాళ్ల తల్లిదండ్రులే నా వంట తినొద్దని విద్యార్థులకు నూరిపోస్తున్నారు. ఇంకా నేను వాళ్లకు ఏం చెప్పేది' అంటూ ఆమె బాధపడ్డారు.
నిజానికి ఈ పరిస్థితి మార్చడానికి గతంలో జిల్లా అధికారులు ప్రయత్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామవాసులతో సమావేశం నిర్వహించి.. ఇలా చేయకూడదని చెప్పిచూశారు. దీంతోపాటు గత నెలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు పాఠశాలలో సామూహిక భోజనాలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. అయితే రాధమ్మ వండిన వంట తినకపోవడానికి కారణం కులవివక్ష కాదని, ఈ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలే అయినప్పటికీ.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ కక్షలతోనే వాళ్లు పాఠశాల మారుతున్నారని స్కూల్ ఇన్‌చార్జి వైఎం వెంకటచలపతి చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరిచాలని, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని, దాంతోపాటు దళిత మహిళా కూక్‌ను మార్చితేనే.. తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుతామని స్పష్టం చేస్తున్నారు.