సింగరేణి తంగలాన్‌..! | KGF And Thangalan Movies Explore Gold In Karnataka's Kolar Goldfield | Sakshi
Sakshi News home page

సింగరేణి తంగలాన్‌..!

Published Sun, Sep 15 2024 12:38 AM | Last Updated on Sun, Sep 15 2024 12:38 AM

KGF And Thangalan Movies Explore Gold In Karnataka's Kolar Goldfield

బొగ్గుగనిలో పని చేస్తున్న కార్మికులు

‘కేజీఎఫ్‌’, ‘తంగలాన్‌ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్‌ గోల్డ్‌ఫీల్డ్‌లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్‌ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్‌ రియలిజం ధోరణిలో ‘తంగలాన్‌’ సినిమా చూపించింది.  బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్‌’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...

మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్‌ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్‌  బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్‌ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.

చావుతో చెలగాటం..
గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్‌ మైన్‌ లో మీథేన్‌  లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి,  కొత్తగూడెంలోని బర్లిపిట్‌ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.

రక్తాలు కారుతుండగా..
బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.

కాంట్రాక్టర్ల దోపిడీ..
కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.

కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..
బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.

సాయుధ పోరాటం..
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్‌  (హైదరాబాద్‌), అజాంజాహీ మిల్‌ వర్కర్స్‌ (వరంగల్‌) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ పేరుతో మూడో యూనియన్‌  ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.

ప్రశ్నించిన శేషగిరి..
నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్‌గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్‌ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్‌ కౌంటర్‌లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.

యూనియన్‌  కొమరయ్య..
కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్‌  వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌  స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్‌ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్‌  కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్‌ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.

హక్కుల సాధన..
కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్‌  దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.

ప్రస్తుతం ఇలా..
ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్‌, సాక్షిప్రతినిధి, కొత్తగూడెం

ఇవి చదవండి: అర్లీ రిటైర్‌మెంట్‌.. ఫరెవర్‌ ఎంజాయ్‌మెంట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement