ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరానికి చెందిన కథనం
ఏళ్ల తరబడి ఆశ్రమంలో..
పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి, అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్‌నగర్‌లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.
కన్నడలో మాట్లాడటంతో..
మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.
ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..
తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.
చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..
అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు
Comments
Please login to add a commentAdd a comment