న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు(బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది.
తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తిచేయడానికి కచి్చతమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది.
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమనల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి, హైకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని తెలియజేసింది.
తీవ్రమైన నేరాల విషయంలో విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలను పాల్పడినట్లు అభియోగాలు నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై విచారణ జరుపుతున్నామని స్ప ష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment