special tribunal
-
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్‌లు
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు(బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తిచేయడానికి కచి్చతమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమనల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి, హైకోర్టు వెబ్సైట్లో పొందుపర్చాలని తెలియజేసింది. తీవ్రమైన నేరాల విషయంలో విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలను పాల్పడినట్లు అభియోగాలు నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై విచారణ జరుపుతున్నామని స్ప ష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. -
పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లు ఏ కారణంతోనైనా అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో వరుసగా నాలుగోరోజు గురువారం సమావేశమైంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచాలనుకుంటున్న పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు సర్పంచ్‌లు ఏదైనా కారణంతో అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రే వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిపై రాజకీయ ఒత్తిళ్లు, ఇతర సమస్యలు వస్తున్నాయనే కారణంతో పంచాయతీలకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా వ్యవహరించవచ్చని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే జరిమానా విధించే హక్కును కూడా సర్పంచ్ నేతృత్వంలోని పాలకవర్గానికి కల్పించే అంశంపై చర్చించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారం..: రోడ్లపై చెత్తవేయడం, ఇంట్లోని మురుగునీటిని వీధుల్లోకి వదలడం, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంవంటి 22 అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాలను గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పంచాయతీ పాలకవర్గమే జరిమానా విధించే అంశంపై చర్చ జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్రమ నిర్మాణాల్లాంటివి చేపడితే వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా కారకుల నుండే వసూలు చేసే అంశాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, దానిని సరిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వ్యయం, పన్నుల వసూళ్లు.. లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలనే నిబంధనను చట్టంలో పొందుపరిచే అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాలనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. సరిగ్గా పనిచేయని కార్యదర్శులను సరెండర్ చేసే అధికారాన్ని పాలకవర్గానికి కట్టబెట్టే దిశగానూ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పిల్లలున్నా పోటీ అర్హత ఉండాలి: గాంధీ నాయక్ వినతి ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతగా ఉన్న నిబంధనను సవరించాలని గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ కోరారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి వీలులేదనే నిబంధనను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. -
మాజీ ఎంపీకి ఉరి శిక్ష
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ మాజీ ఎంపీకి ఉరి శిక్ష వేశారు. ఆ దేశ స్వాతంత్ర పోరాటం సమయంలో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అతడికి ఉరి శిక్ష ఖరారు చేసి మరికొంతమందికి జీవిత కారాగార శిక్ష వేసింది. అయితే, ఆ ఎంపీకి సంబంధించిన న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసును మరోసారి అపీల్ చేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో యుద్ధ నేరాల పేరిట పలువురుని ఇటీవల కాలంలో ఉరి తీస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం జమాతే ఈ ఇస్లామి పార్టీకి చెందిన షాకావత్ హుస్సేన్ గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఇస్లామీ చత్ర సంఘలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో దేశ విముక్తికోసం పోరాడాల్సిందిపోయి.. బంగ్లాపై యుద్ధానికి దిగిన పాక్‌కు సహాయం చేసి ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలను విచారించిన ట్రిబ్యునల్ అతడికి ఉరి శిక్షను వేసింది. -
ఎన్నికల నేరాల విచారణకు ట్రిబ్యునల్ అవసరం
పోటీచేయని పార్టీలు సైతం నిధుల కోసం వెంపర్లాట ఎన్నికల తరువాత అధికారాలను కోల్పోతున్న కమిషన్ కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ కాచిగూడ: దేశంలో ఎన్నికల నేరాలను విచారించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. రాజకీయ పార్టీలను నియంత్రించడానికి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆదివారం కాచిగూడ బద్రుక కళాశాల ఆడిటోరియంలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ఐదో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రాజకీయ పార్టీలు - క్రమబద్ధీకరణ’ అనే అంశంపై మాడభూషి శ్రీధర్ మాట్లాడు తూ దేశంలో 1,703 రాజకీయ పార్టీలకు గాను అందు లో 6 జాతీయ పార్టీలు ఉన్నాయన్నారు. 1,012 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల నిధులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలో పార్టీ ల ప్రస్తావనే లేదని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకు బడా సంస్థ ల వారు రాజకీయ పార్టీలకు చందాలిచ్చి రూ.30 లక్షల కోట్ల మేర పన్ను రాయితీలు పొందారన్నారు. ఎన్నికల తరువాత ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి అధికారాలు ఉండటం లేదని, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు నిధుల కోస మే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, వారిని అడిగే నాథుడే లేడన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్ పి.హనుమాన్ చౌదరి, ప్రధానకార్యదర్శి నాగరాజారావు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయండి’
ముంబై: ముస్లిం యువకులపై నమోదైన ఉగ్రవాద కేసుల విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ డిమాండ్ చేసింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై ఆజాద్ మైదాన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మద్ని ప్రసంగించారు. ఉగ్రవాద కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. మైనారిటీల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద కేసుల్లో ముస్లిం యువకులు చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి కేసుల్లో అమాయక ముస్లిం యువకులు అరెస్టవుతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనేక ఉగ్రవాద కేసులకు సంబంధించి అనేక తీర్పులొచ్చాయని, ఆ కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకులు విడుదలయ్యారని అన్నారు. అయితే ఇంకా కొంతమంది కారాగారాల్లోనే ఉన్నారని, ఆ నష్టాన్ని ఏవిధంగా పూడుస్తారంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసుల ఉపసంహరణ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్నారు.