సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లు ఏ కారణంతోనైనా అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో వరుసగా నాలుగోరోజు గురువారం సమావేశమైంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచాలనుకుంటున్న పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇప్పటివరకు సర్పంచ్‌లు ఏదైనా కారణంతో అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రే వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిపై రాజకీయ ఒత్తిళ్లు, ఇతర సమస్యలు వస్తున్నాయనే కారణంతో పంచాయతీలకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా వ్యవహరించవచ్చని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే జరిమానా విధించే హక్కును కూడా సర్పంచ్ నేతృత్వంలోని పాలకవర్గానికి కల్పించే అంశంపై చర్చించారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారం..: రోడ్లపై చెత్తవేయడం, ఇంట్లోని మురుగునీటిని వీధుల్లోకి వదలడం, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంవంటి 22 అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాలను గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పంచాయతీ పాలకవర్గమే జరిమానా విధించే అంశంపై చర్చ జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్రమ నిర్మాణాల్లాంటివి చేపడితే వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా కారకుల నుండే వసూలు చేసే అంశాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది.
ఇప్పటివరకు పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, దానిని సరిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వ్యయం, పన్నుల వసూళ్లు.. లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనే నిబంధనను చట్టంలో పొందుపరిచే అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాలనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది.
సరిగ్గా పనిచేయని కార్యదర్శులను సరెండర్ చేసే అధికారాన్ని పాలకవర్గానికి కట్టబెట్టే దిశగానూ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు పిల్లలున్నా పోటీ అర్హత ఉండాలి: గాంధీ నాయక్ వినతి
ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతగా ఉన్న నిబంధనను సవరించాలని గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ కోరారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి వీలులేదనే నిబంధనను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment