
కలహండి: ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు(Online gaming scams) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కోట్లాది రూపాయలు మోసగాళ్ల పాలవుతోంది. తాజాగా ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ కోసం రూ.మూడు కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన నేపధ్యంలో ఒక పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (పీఈఓ)ని ఇటీవలే కార్యాలయం నుంచి సస్పెండ్ చేశారు.
ఇప్పుడు అతనిని రాష్ట్ర విజిలెన్స్ విభాగం(State Vigilance Department) అరెస్టు చేసింది. ఈ సంఘటన గురించి ఒక అధికారి మీడియాకు వివరాలు తెలిపారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారి దేబానంద సాగర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇందుకోసం ఆయన వివిధ పంచాయతీల సర్పంచ్‌ల సంతకాలను ఫోర్జరీ చేశాడని కూడా తేలిందని తెలిపారు.
కలహండి జిల్లాలోని తుమల్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని తలనేగి గ్రామ పంచాయతీ, పొడపాదర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రూ.3.26 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు దేబానంద సాగర్‌పై ఆరోపణలు ఉన్నాయన్నారు. సాగర్ ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు పంపాడని ఆయన తెలిపారు. దేబానంద సాగర్ తల్నేగి గ్రామ పంచాయతీ నుండి రూ.1.71 కోట్లు, పొడపదర్ గ్రామ పంచాయతీ నుండి రూ.1.55 కోట్లు దుర్వినియోగం చేశాడు. సర్పంచ్‌ల సంతకాలను ఫోర్జరీ(Forgery) చేయడం ద్వారా అతను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్)ను దుర్వినియోగం చేశాడు.
ఇంతేకాకుండా దేబానంద సాగర్ 15వ కేంద్ర ఆర్థిక సంఘం (సీఎఫ్‌సీ), 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం ఖాతాల నుండి ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. నిందితుడు దేబానంద్ సాగర్ 2016, జూలై 4, తలనేగి గ్రామ పంచాయతీలో పీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. 2018, మే 5 నుండి 2022, మార్చి 17 వరకు అతను పొడపదర్ గ్రామ పంచాయతీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఈ సమయంలోనే అతను ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు.
ఇది కూడా చదవండి: మామ అభ్యంతరకరంగా తాకాడని..
Comments
Please login to add a commentAdd a comment