ఏడు జిల్లాల్లో కుండపోత వాన
Published Mon, Sep 9 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం మొదలైంది. ఆదివారం ఉదయం వరకు కుండపోతగా కురిసింది. ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రోడ్లు నదుల్ని తలపించాయి. సేలంలోని ఏర్పాడులో ఐదు సెం.మీ, ధర్మపురిలో నాలుగు సెం.మీ, సేలం, ఈరోడ్, కృష్ణగిరిలో మూడు సెం.మీ వర్షపాతం నమోదైంది. చెన్నైలో ఆదివారం సాయంత్రం తెరపించి తెరపించి వర్షం పడింది. అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటలు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది కాస్త వినయక చవితి వ్యాపారంపై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement