కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.
కోటీశ్వరుడిగా గుకేశ్
ఇక వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్‌కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.
నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపై
ఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్‌మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు.
నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.
అప్పుడే మా అమ్మకు సంతోషం
ఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.
పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్‌కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్‌కు వెల్‌కమ్ చెప్పారు.
అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు.
ఇక మంగళవారం గుకేశ్‌కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్‌కు అందించనున్నారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే
‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్‌షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.
అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.
ఆయన సహకారం మరువలేనిది
తన చాంపియన్‌షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్‌లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను.
ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్‌టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment