పెద్ద మోరీకి భారీ అడ్డం
-
నాలా వెంబడి కళాశాల నిర్మాణం
-
17 అడుగుల నాలా కనుమరుగు
-
ఓ విద్యాసంస్థ నిర్వాకంతో వరద ముప్పు
-
జీడబ్ల్యూఎంసీ ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందా..
సాక్షి, హన్మకొండ : మూడు రోజుల క్రితం కుండపోత వర్షానికి హన్మకొండ నయీంనగర్ దగ్గర పెద్ద మోరీ ఉప్పొంగి ప్రవహించడంతో వంతెన పైకి నీరు చేరుకుంది. ఆ ప్రాంతమంతా జలయమౖయెంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలు లోతు వరకు వంతెనకు ఇరువైపులా నీరు చేరడంతో ట్రాఫిక్‌ను ఆపేశారు. ఇదే వర్షాలకు హనుమాన్‌నగర్ వద్ద పెద్దమోరీ వాగు వంతెన దగ్గర మాత్రం ఎటువంటి సమస్యా తలెత్తలేదు. భారీగా వచ్చిన వరద నీరు సాఫీగా వెళ్లిపోయింది. రాకపోకలకు ఎలాంటి ఆటంకమూ కలుగలేదు. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వంతెలన వద్ద వరద నీరు వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల మధ్య తేడా ఇదీ.. ఈ రెండు వంతెనల మధ్య ఉన్న నాలాకు ఇరువైపులా వెలిసిన ఆక్రమ నిర్మాణాల కారణంగానే ఈ తేడా వచ్చింది. నాలా వెంబడి ఉన్న ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం చేపట్టిన నిర్మాణ కారణంగా నాలా వెడల్పు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
20 అడుగుల మేరకు...
పెద్ద మోరీ నాలా వెంబడి ప్రైవేటు కాలేజీ యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు నాలా పాలిట శాపంగా మారాయి. నయింనగర్ వద్ద పెద్ద మోరీ 60 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తోంది. ఇదే నాలా ఈ ప్రైవేటు కాలేజీ దగ్గరికి వచ్చే సరికి 53 అడుగులకు తగ్గిపోయింది. ఈ కాలేజీని దాటే సరికి నాలా వెడల్పు మరింత తగ్గి 43 అడుగులకు చేరుకుంది. కేవలం కాలేజీ విస్తరించిన ఉన్న ప్రాంతంలో నాలా వెడల్పు దాదాపు పది అడుగుల మేరకు తగ్గిపోయింది. నాలా స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ స్థాయిలో నాలా వెడల్పు తగ్గిపోవడంతో గురువారం, శుక్రవారం కురిసిన వర్షపు నీరు ముందుకు పోలేదు. ఫలితంగా వరద నీరు వెనక్కి వచ్చి రోడ్లు, వీధులను ముంచెత్తింది. నాలాల కబ్జాల కారణంగా తలెత్తుతున్న సమస్యలపై ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. నాలా వెంబడి వెలసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి.