కుండపోతగా వర్షం
జలమయమైన రోడ్లు
జనజీవనానికి తీవ్ర అంతరాయం
పాడేరు రూరల్ : పాడేరు ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. వారం రోజులుగా ఏజెన్సీలో మబ్బులు, చిరుజల్లులే పడుతున్నాయి. కొన్ని రోజులుగా మబ్బువాతావరణం కొనసాగిన మన్యంలో మధ్యాహ్నం వరకు ఎండకాసింది. అనంతరం ఒక్క సారిగా మార్పు చోటుచేసుకుంది. ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం పడింది. సుమారు ఆరు గంటలపాటు ఏకధాటిగా వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.
సుదూర ప్రాంతాల నుంచి పాడేరు వచ్చినవారు స్వగ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటపొలాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. మండలంలోని ఇరడాపల్లి, పాడేరు-పెదబయలు మండలాల సరిహద్దులోని పి.కోడాపల్లి వద్ద మత్య్సగెడ్డపొంగి ప్రవాహించింది. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. సాగుకు ఈ వర్షం మేలు చేస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.