వర్షబీభత్సం | 'Phailin' Tufan | Sakshi
Sakshi News home page

వర్షబీభత్సం

Published Thu, Oct 10 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

'Phailin' Tufan

= జడివానలతో  జన జీవనం అస్తవ్యస్తం
=    పిడుగులు పడి ఇద్దరు మృతి
=     చోడవరంలో నీటమునిగిన పంటపొలాలు
=     {పమాద స్థాయికి పెద్దేరు, తాచేరు నదులు
 =    కోనాం గేట్లు ఎత్తివేత

 
చోడవరం,న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను వాయుగుండం కారణంగా జిల్లా అస్తవ్యస్తమయింది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి జడివానలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్.రాయవరం, పెదబయలు మండలాల్లో చెరొకరు మృతి చెందారు. మాకవరపాలెం,చీడికాడ మండలాల్లో ఏడు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఒక పక్క కరెంటు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో వంక ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సమస్య తీవ్రమైంది. కరెంటు లేక కార్మికులకు, వర్షాల వల్ల కూలీలకు పనిలేకుండా పోయింది. చోడవరంలో సుమారు 4 సెం.మీ వర్షం పడింది. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట, వడ్డాది ప్రాంతాల్లో 2 నుంచి 3 సెం.మీ వర్షం కురిసింది.

భారీ వర్షాల వల్ల పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులతోపాటు కొండగెడ్డలు  పొంగి ప్రవిహ స్తున్నాయి. పెద్దేరు, తాచేరులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. భీమిలి-నర్సీపట్నం రోడ్డులో చోడవరం సమీపంలో బొడ్డేరు నదిపై ఉన్న కాజ్‌వేకు భారీ గండి పడింది. కాజ్‌వే పైనుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది. గండి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ దారిలో వెళ్లాల్సిన వాహనాలను గౌరీపట్నం మీదుగా వడ్డాది జంక్షకు మళ్లిస్తున్నారు.

కోనాం జలాశయం నుంచి ఒక గేట్లు ఎత్తి 300క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేయగా పెద్దేరు జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి వదిలారు. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. లక్ష్మీపురం, కస్పా, ఎం.కోటపాడు, ముకుందపురం ప్రాంతాల్లో కనుచూపుమేరలో పొలాలు నీట మునిగాయి. చోడవరంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహించింది.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దాంతో పనులు లేక ప్రజలంతా అల్లాడిపోయారు. గ్రామాలు చీకట్లోనే కాలం వెళ్లదీశాయి. యలమంచిలిలోనూ వర్షం కురిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుకుంపేట మండలంలో భారీ వర్షానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో వర్షాల వల్ల కూరగాయల పంటలకు మేలు కలుగుతుందని గిరిరైతులు అంటున్నారు. పాడేరులోనూ వర్షం కురిసింది.
 
గిరిజనుడి మృతి

హుకుంపేట: పశువులు కాసేందుకు కొండపైకి వెళ్లిన గిరిజనుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. తీగలవలసలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.  బోయిన సీతారామయ్య (40) పశువులు కాసేందుకు సమీపంలో కొండపైకి  తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురవంతో చెట్టు కిందకు చేరాడు. చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో సీతారామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి

మాకవరపాలెం మండలంలో పిడుగుపాటుకు మూడు పశువులు చనిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. లచ్చన్నపాలెంలో కిల్లాడ రామ్మూర్తి ఇంటి వద్ద పిడుగుపడి రూ. 50 వేల విలువైన ఆవు మృతి చెందింది. వజ్రగడలో అప్పలనాయుడుకు చెందిన లక్ష విలువైన రెండు గేదెలు పిడుగుపాటుతో మృతి చెందాయి. పిడుగులు పడి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. చీడికాడ మండలంలో పిడుగులకు నాలుగు పశువులు మృతి చెందాయి. చినబోడిమెట్టలో బొడ్డు మంగునాయుడుకు చెందిన రెండు ఎద్దులు, , చీడికాడలో గండి అక్కునాయుడుకు చెందిన రెండు ఆవులు ఒకేచోట మృతి చెందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement