యువతి అనుమానాస్పద మృతి
లంగర్‌హౌస్: పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం అనుమానాస్పదస్థితిలో యువతి మృతదేహం లభించింది. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎంఏ జావీద్, మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి అత్తాపూర్‌లో నివసిస్తోంది. ఆమెకు కూతురు కావ్యశ్రీ(21), కుమారుడు ఉన్నారు. మూడేళ్ళ క్రితం ఆమె భర్త రవీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆమె కుమార్తె కావ్యశ్రీ ఏడాదిన్నరగా మాదాపూర్‌లోని డీఎల్‌ఎఫ్ సంస్థకు అనుబంధమైన యూనిసిస్‌లో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తోంది.
సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కావ్యశ్రీ కనిపించకపోవడంతో విధులకు వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. అయితే ఉదయం 7.30 ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.74 సమీపంలోని ర్యాంపు దారిపై అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కావ్యశ్రీ సెల్‌ఫోన్ కాల్ డిటేల్స్,, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
అన్నీ అనుమానాలే...
♦ కావ్యశ్రీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావ్యశ్రీ ఇళ్లు అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.130 సమీపంలో ఉండగా, ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆమె తరచూ పిల్లర్ నెం.128 వద్ద ఆటో ఎక్కేది.
♦ మృతదేహం లభ్యమైన పిల్లర్ నెం.74 నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఫ్‌లైఓవర్ పైకి వెళ్ళే వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. ద్విచక్ర వాహనాలకు కూడా ఈ రోడ్డులో అనుమతి లేదు. మృతురాలు అక్కడికి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
♦ కావ్యశ్రీ యూనిఫాం, టిఫిన్ బాక్సు సోమవారం ఆమె మృతదేహం వద్ద లభించలేదు. మృతదేçహానికి 150 మీటర్ల దూరంలో ఆమె చెప్పులు పడి ఉండటమూ అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోన్ సైతం మరికొంత దూరంలో పడుంది.
♦ ఒక వేళ ఏదైనా వాహనం ఆమెను ఢీ కొట్టి ఉన్నా ఆమె ఒంటిపై గాయాలు ఉండాలి. అయితే మృతదేహంపై నడుము వద్ద మాత్రమే గాయమైంది. ఆమె ముక్కు, నోరు, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమైంది. నుదురు తదితర ప్రాంతాల్లో కమిలిన గాయాలు కనిపిస్తున్నాయి.
♦ కావ్యశ్రీ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందనే అంశం పైనా స్పష్టత లేదు. సోమవారం ఉదయం తమకు కనిపించలేదని, రోజూ బయటకు వచ్చే సమయంలో మాత్రం రాలేదని కుటుంబీకులు చెబుతున్నారు.