పంజగుట్ట మోడల్ హౌజ్ వద్ద చెరువును తలపిస్తున్న రోడ్డు
► సిటీలో 5 సెంటీమీటర్ల వర్షం
► చెరువులను తలపించిన
ప్రధాన రహదారులు
► ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్
► తీవ్ర ఇక్కట్లపాలైన జనం
► పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై దారి కనిపించక మూడు కార్లు ఢీ
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యథావిధిగా నగరవాసికి మరోసారి ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. రహదారులపై మోకాలు లోతు నీరు నిలవడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైన వర్షంలో వాహనాలు కనబడక మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో దాదాపు రెండుగంటపాటు ఈ దారిలో ట్రాఫిక్ స్తంభించింది. పాఠశాలల, కళాశాలల నుంచి, ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన చిన్నారులు, మహిళలు నానా అవస్థలు పడ్డారు. కొందరు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇంటికి చేరుకోలేక పోయారు.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం
పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రహదారులు చెరువులను తలపించాయి. వరదనీరు పోటెత్తడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది.
► సికింద్రాబాద్ బోయిగూడ రైల్వే బ్రిడ్జి కింద నడుము లోతు వరకు వరదనీరు పోటెత్తడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారలు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
► కంటోన్మెంట్ నాలుగు, ఐదు వార్డుల్లో పలు బస్తీలు వర్షంధాటికి అతలాకుతలమయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో జూబ్లీబస్టాండ్, స్వీకార్ ఉపకార్ వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.
► బహదూర్‌పురా, కిషన్‌బాగ్ నాలాలు పొంగిపొర్లడంతో పాతనగరంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. బహదూర్‌పురా చౌరస్తాలోని నాలాలో చెత్త చెదారం పేరుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకొని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
► కుండపోత వర్షానికి నాచారం పెద్ద నాలాకు పెద్దఎత్తున వరద నీరు పోటెత్తింది. నాచారం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రోడ్డుమార్గంలో ఉన్న కల్వర్టు ఉప్పొంగి ప్రవహించింది. కల్వర్టు దాటడానికి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ► నాచారం పోలీస్ స్టేషన్ నుండి నాచారం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామయ్యింది.