కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నివారణపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న కృష్ణా, గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డెల్టా కాలువల్లో కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తోందన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నివారణపై జలవనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాలుష్య నియంత్రణ కోసం పని చేస్తున్న సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు. మొదటి దశలో మురుగు నీటిని కాలువల్లో వదులుతున్న ప్రదేశాలను గుర్తించాలని, రెండో దశలో మురుగు నీటిని శుద్ధి చేశాకే కాలువల్లోకి వదలిపెట్టాలని, మూడో దశలో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్దేశించారు. ఇందుకోసం కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ మిషన్‌కు తానే చైర్మన్‌గా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.
జీడబ్ల్యూఎస్ సహకారం
కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన గండిపేట వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ప్రతినిధులను సమావేశంలో సీఎం అధికారులకు పరిచయం చేశారు. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నియంత్రణ చర్యలకు ఈ సంస్థ సహకారం తీసుకోవాలని సూచించారు. కేరళలోని కన్నూర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం జీడబ్ల్యూఎస్ చేపట్టిన చర్యలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అదే తరహాలో ఈ సంస్థ సహకారంతో కృష్ణా, గోదావరి డెల్టా కాలువల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్‌కు జీడబ్ల్యూఎస్ ప్రతినిధి రాజశ్రీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని నాలుగు కిలోమీటర్ల పొడవున కృష్టా డెల్టా కాలువను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment