ప్రతి వ్యక్తికీ రోజుకు 100 లీటర్ల మంచినీరు
ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణాలో ఉన్న 8,700 గ్రామాల్లో కేవలం 470 గ్రామాల్లోనే 100 శాతం మరుగుదొడ్లు ఉండడం సిగ్గుపడాల్సిన విషయమని, రాబోయే రాజుల్లో ప్రతీ గ్రామంలో మరుగుదొడ్లు, మురుగునీరు, మంచినీటి వ్యవస్థలను నిర్మించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు పేర్కొన్నారు. బేగంపేట హరిత హోటల్‌లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నిర్మల్ గంగా పురస్కార్ అవార్డు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఘన, ద్రవ వ్యర్ధాలను సమర్థవంతంగా రీసైకిల్ చేసి పరిశుభ్రమైన పల్లెల నిర్మాణానికి బాటలు వేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌తో పాటు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించి తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మరుగుదొడ్ల నిర్మాణంలో 100 శాతం ఫలితం సాధించి ఉత్తమ పనితీరు కనపరిచిన 36 గ్రామపంచాయతీల ప్రతినిధులకు నిర్మల్ గంగా పురస్కార్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్, సెర్ప్ అదనపు సీఈవో మురళి, ఎమ్మెల్యే బడిగే శోభ, యునిసెఫ్ ప్రతినిధులు, గ్రామకార్యదర్శులు పాల్గొన్నారు.