చెప్పినవన్నీ చేస్తున్నాం
♦ కేజీ టు పీజీ మినహా 99.5 శాతం హామీలు అమల్లోకి..: సీఎం కేసీఆర్
♦ వరంగల్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమక్షంలో బీ ఫారం అందజేత
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని, మేనిఫెస్టోలో లేని ఎన్నో మంచి పథకాలను ప్రారంభించామని చెప్పారు. విద్యుత్ కోతలతో అల్లాడిన రాష్ట్రాన్ని అసలు కోతలే లేని స్థితికి తెచ్చామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తామని, అదే క్రమంలో వరంగల్ అభ్యర్థిగా పసునూరు దయాకర్‌కు అవకాశమిచ్చామని పేర్కొన్నారు. శనివారం వరంగల్ జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
మనమే నంబర్‌వన్..
కేజీ టు పీజీ మినహా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను 99.5 శాతం నెరవేరుస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనని... రాష్ట్ర విభజన తర్వాత ఆరేడు నెలల పాటు ఐఎఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు జరగకున్నా అనేక మంచి పనులు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సంక్షేమ పథకాల అమలులో దేశంలో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. మీడియా సంస్థ సీఎన్‌ఎన్ నంబర్‌వన్ స్టేట్ అవార్డు కూడా ప్రకటించింది. ఇండియా టుడే అవార్డును ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో అందుకోబోతున్నాం. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోతల మూలంగా పడిన బాధ వర్ణనాతీతం. ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 38 లక్షల మంది సామాజిక పింఛన్లు ఇస్తున్నాం.
మేనిఫెస్టోలో లేకున్నా చరిత్రలో మొదటి సారిగా హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కోసం ఎవరూ డిమాండ్ చేయకున్నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తాం. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైనా ఈ ఏడాది 60 వేలు నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెంచుతాం..’’ అని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో నిర్మించిన ఏడు ఇళ్లు ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క డబుల్ బెడ్‌రూంతో సమానమని పేర్కొన్నారు.
అందరికీ అవకాశం..
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నుంచీ ముందు వరుసలో ఉన్న వారికి పదవులు ఇస్తాం. వరంగ ల్ లోక్‌సభ ఉప ఎన్నిక టికెట్‌ను చాలా మంది ఆశించారు. రవికుమార్, పరంజ్యోతి, పరమేశ్వర్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు టికెట్ అడిగారు. ఏ పార్టీ అయినా ఒక్కరికే అవకాశం ఇవ్వగలుగుతుంది. అదే వరుసలో పసునూరి దయాకర్‌కు అవకాశం ఇచ్చాం. ఆయనకు రెండు మూడు పర్యాయాలు పోటీ చేసే అవకాశం దగ్గరగా వచ్చినా చివరి నిమిషంలో దక్కలేదు. అయినా ఉద్యమంలో, ఎన్నికల సందర్భంలో విధేయతతో పనిచేశాడు.
తెలంగాణ తల్లి విగ్రహానికి రూపశిల్పి కూడా. టికెట్ కోసం పోటీ పడిన నేతలందరినీ పిలిచి ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశా. సమయం వచ్చినపుడు నాయకుల అర్హతలను బట్టి అందరికీ అవకాశాలు ఇస్తాం..’’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ సర్కారు చేసిన మంచి పనులను అందరూ గుర్తిస్తున్నారని, సర్వే ప్రకారం అద్భుత విజయం సాధించబోతున్నామని చెప్పారు. దయాకర్ డబ్బులున్న వ్యక్తి కాదని, పార్టీయే ఎన్నికల ఖర్చును భరిస్తుందని పేర్కొంటూ... దయాకర్‌కు కేసీఆర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీ వినోద్‌కుమార్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల సమక్షంలో పసునూరి దయాకర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ బీఫారం అందజేశారు.
వాటర్ గ్రిడ్‌పై రాష్ట్రాల ఆసక్తి
రూ. 40 వేల కోట్లతో రెండున్నరేళ్లలో వాటర్‌గ్రిడ్‌ను పూర్తి చేసేందుకు రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటర్‌గ్రిడ్ పథకంపై బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల్లో గందరగోళం జరిగిందన్నారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేసిన దేవాదుల ప్రాజెక్టు నుంచి కనీసం 60-70 రోజులు కూడా నీరు తీసుకునే పరిస్థితి లేదని... ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తిచేసి త్వరలో ఇరిగేషన్ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్ రీడిజైనింగ్ కొలిక్కి వచ్చిందని, ఎల్‌ఎండీ కాలువకు రూ. 130 కోట్లతో వచ్చే జూన్ నాటికి మరమ్మతు పూర్తిచేసి నీరు అందిస్తామని చెప్పారు. 28 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ద్వారా భవిష్యత్తులో కోతలు లేని రాష్ట్రంగా చేసుకుంటామన్నారు.