శ్రీశైలంలో కనీస మట్టం 854 అడుగులు దాటిన నీటి నిల్వ
ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
జూలై ఆఖరుకు చేరుకున్నా నీటి ఎత్తిపోతను ప్రారంభించని రాష్ట్ర ప్రభుత్వం
రాయలసీమలో వర్షాభావంతో నోళ్లు తెరుచుకున్న జలాశయాలు, చెరువులు
తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు, అన్నదాతలు
మరోవైపు శ్రీశైలంలో 806.3 అడుగుల నుంచే నీటిని తోడేస్తున్న తెలంగాణ
2019–24 మధ్య సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించిన గత ప్రభుత్వం
నిర్ణీత 40 టీఎంసీలు తరలించాలంటే 120 రోజులు ఎత్తిపోయాలి
ఆలస్యం చేస్తే తెలంగాణ దెబ్బకు నీరు అందుబాటులో ఉండదంటున్న అధికారులు
గత ప్రభుత్వ తరహాలోనే 800 అడుగుల నుంచే నీటిని తరలించాలంటున్న రైతులు
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నా, మన రాష్ట్రంలోని హంద్రీ–నీవా ప్రాజెక్టు గురించి మాత్రం ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం నాటికి నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు పైగా చేరింది.. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి దిగువకు తరలిస్తోంది.. జూన్ 3 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 806.3 అడుగుల్లో 32.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు ప్రారంభించింది.. కానీ ఇప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలే కురిశాయి. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన జలాశయాలు.. కాలువకు ఇరు వైపులా ఉన్న చెరువులు నీళ్లు లేక నోళ్లు తెరుచుకోవడం.. భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో తాగు, సాగునీటికి సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ 3 నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేయక పోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాయలసీమపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లూ రాయలసీమ సస్యశ్యామలం
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రూ.6,850 కోట్లతో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా వరకు పనులు పూర్తవడంతో 2012–13 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు ప్రభుత్వం నీటిని తరలిస్తోంది.
ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 120 రోజులపాటు రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయాలి. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటంతో 120 రోజులు నీరు నిల్వ ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా సామర్థ్యం పెంచే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూన్ రెండో వారం నుంచే 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏటా సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని తరలించి.. రాయలసీమలో చెరువులు, జలాశయాలను నింపారు. ప్రధాన కాలువ కింద, చెరువులు, జలాశయాల ఆయకట్టుతోపాటు భూగర్భ జల మట్టం పెరగడంతో రైతులు బోర్లు, బావుల కింద భారీ ఎత్తున పంటలు సాగు చేసి ప్రయోజనం పొందారు. దాంతో గత ఐదేళ్లూ సీమ సస్యశ్యామలమైంది.
నాటి లానే నేడూ
రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మీనమేషాలు లెక్కించింది. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఎన్నడూ సామర్థ్యం మేరకు అంటే ఏటా 40 టీఎంసీలు తరలించిన దాఖలాలు లేవు. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం.. ఆలోగా శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఏటా సగటున 27.46 టీఎంసీలను మాత్రమే అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇవ్వగలిగింది. కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019–20, 20–21లో సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించింది.
2021–22, 22–23లలో రాయలసీమలో భారీ వర్షాలు కురవడం.. చెరువులు నిండిపోవడం.. వరదలతో హంద్రీ–నీవా నీటి అవసరం పెద్దగా లేకపోయింది. 2023–24లో కృష్ణా బేసిన్‌లో తీవ్రమైన వర్షాభావంతో నీటి కొరత ఉన్నప్పటికీ.. హంద్రీ–నీవా ద్వారా 32.49 టీఎంసీలను తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మళ్లీ మీనవేషాలు లెక్కిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment