శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఖాళీ! | Water storage in Srisailam reservoir drops below minimum level | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఖాళీ!

Published Sat, Feb 1 2025 4:52 AM | Last Updated on Sat, Feb 1 2025 4:52 AM

Water storage in Srisailam reservoir drops below minimum level

జలాశయంలో కనీస మట్టానికి దిగువకు చేరిన నీటి నిల్వ

దిగువన అవసరం లేకున్నా ఎడమ గట్టు కేంద్రంలో 

విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్న తెలంగాణ  

జూన్‌ నుంచి ఇదే తంతు..  

ప్రేక్షకపాత్ర వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌లో శుక్రవారం 552.4 అడుగుల్లో 215.1 టీఎంసీలు నిల్వ ఉన్నాయి... కుడి, ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సరఫరా చేయడానికి సరిపడా నీళ్లున్నాయి... అంటే.. సాగర్‌ ఆయకట్టుతోపాటు దిగువన కూడా ఎలాంటి నీటి అవసరాలు లేవన్నది స్పష్టమవుతోంది. అయినా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ శుక్రవారం 14,126 క్యూసెక్కులను తరలిస్తోంది. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ కనీస నీటి మట్టం(minimum water level) 854 అడుగులకంటే దిగువకు చేరుకుంది. 

శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు 215.80 టీఎంసీలు కాగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 853.2 అడుగుల్లో 87.24 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. పోతిరెడ్డి­పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించలేని పరిస్థితి ఏర్పడింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కేవలం 1,600 క్యూసెక్కులను మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. 

తెలంగాణ జెన్‌కో ఇదే రీతిలో నీటిని తోడేస్తే.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కృష్ణా జలాలపై రాయల­సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల హక్కులను తెలంగాణ జెన్‌కో కాలరాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని నీటిపా­రు­దలరంగ నిపుణులు మండిపడుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి 2019–20, 20–21, 21–22, 22–23 తరహాలోనే ఈ నీటి సంవత్సరంలోనూ శ్రీశైలానికి గరిష్టంగా 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 

అయినా జనవరి ఆఖరుకే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు సమన్వయం చేసి ఉంటే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 869.72 టీఎంసీలు కడలిలో కలిసేవి కావని..  శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

ఆది నుంచి ఇదే తీరు...
నీటి సంవత్సరం ప్రారంభం నుంచే వరద ప్రవాహం మొదలు కాకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జూన్‌ మొదటి వారంలో నీటిని తరలించే ప్రక్రియకు తెలంగాణ సర్కార్, జెన్‌కో శ్రీకారం చుట్టాయి. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు లేకపోయినా యథేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ వచ్చింది. రబీలో సాగు.. వేసవిలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలని, విద్యుత్‌ ఉత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు ఆదేశించినా... తెలంగాణ జెన్‌కో ఖాతరు చేయలేదు. 

తెలంగాణ జెన్‌కో యథేచ్ఛగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది శ్రీశైలానికి 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చినా ఫలితం లేకపోయిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బోర్డుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి.. తెలంగాణ జెన్‌కోను కట్టడి చేసి ఉంటే శ్రీశైలంలో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement