గోదావరి తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద వరద తగ్గినప్పటికీ, ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని, వాగులు, వంకల్లో వరద కొనసాగుతోంది. దీంతో భద్రాచలంతో పాటు దాని దిగువ ప్రాంతాల్లో గోదావరి ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా, ఎగువ గోదావరిలో 25వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి నిల్వలు 23.31 టీఎంసీలకు చేరాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌లకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వలు 12.13 టీఎంసీలకు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌లోకి సోమవారం సాయంత్రం 9,54,130 క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి 7,71,580 క్యూసెక్కులకు తగ్గింది. మేడిగడ్డలోకి చేరుతున్న వరదను చేరుతున్నట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్‌లోకి సోమవారం సాయంత్రం 10,15,170 క్యూసెక్కులు రాగా, శనివారం సాయంత్రం 9,36,570 క్యూసెక్కులకు తగ్గాయి. మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌లకు వచి్చన వరదను వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి దిగువ గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్‌లోకి సోమవారం సాయంత్రం 11,86,801 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 12,88,481 క్యూసెక్కులకు పెరిగింది. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 7 గంటలకు 12,17,861 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారానికి స్వల్పంగా పెరిగి 12,58,826 క్యూసెక్కులకు చేరింది. మంగళవారం ఉదయం 51.06 అడుగులుగా ఉన్న నీటిమట్టం కొంతసేపు నిలకడగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. సాయంత్రం 6 గంటలకు 50.04 అడుగులకు చేరింది. మంగళవారం రాత్రి 12 గంటల సమయానికి 49.03 అడుగులకు నీటి మట్టం చేరింది. కాగా, రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా 48 అడుగుల కంటే తగ్గితే రెండవ, 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. బుధవారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా తగ్గనుందని సీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడంతో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భద్రాచలం నుంచి రాకపోకల్ని ఇంకా పునరుద్ధరించలేదు.శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి» 1,51,481 క్యూసెక్కుల నీటి రాకతో 842.42 అడుగులకు చేరిన నీటిమట్టం» ఎగువన కృష్ణా ప్రధానపాయలో కొనసాగుతున్న వరద » ఆల్మట్టి నుంచి 1.50, నారాయణపూర్ నుంచి 1.43 లక్షలు, జూరాల నుంచి 1,51,790 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల » శ్రీశైలంలోకి గంటగంటకూ పెరుగుతున్న కృష్ణా ప్రవాహం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టుకు 1.09లక్షల క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సరిగ్గా ఇదే సమయానికి 1,51,481 క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 832.5 అడుగుల నుంచి 842.42 అడుగులకు, నీటినిల్వ సామర్థ్యం 52.14 నుంచి 63.81 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధానపాయతో పాటు ఉపనదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా 1.65లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపీ పెరుగుతోంది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మంగళవారం తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,04,972 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 85,148 క్యూసెక్కులకు తగ్గింది. డ్యామ్ నీటి నిల్వ 93.46 టీఎంసీలకు చేరుకోగా, 9149 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా.. అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది.