పనిచేయని స్థితిలో 329.8 మెగావాట్ల జల విద్యుత్ యూనిట్లు
మరమ్మతులు జరగకపోవడం, నిర్వహణ లోపమే కారణం!
ఆరు నెలలుగా టెండర్లు ఖరారు చేయని జెన్‌కో
కృష్ణాలో వరదలు ప్రారంభమైతే విద్యుత్‌ను నష్టపోయే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల వంటి నాలుగు ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు గత కొంతకాలంగా మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం క్షీణించిపోయింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా, టెండర్ల నిర్వహణలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) తాత్సారం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరికొన్ని రోజుల్లో కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు ప్రారంభం కానుండగా, పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని చేసుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు తెలిసింది. ఇదే జరిగితే రూ.కోట్లు విలువ చేసే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చిన్నచిన్న సమస్యలే అయినా..
రాష్ట్రంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 2441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాలుండగా, ఎప్పటికప్పుడు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం 329.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలన్నింటిలో ఒక్కో యూనిట్ పనిచేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి.
గత ఆరు నెలలుగా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. చిన్న చిన్న సమస్యలే ఉండడంతో ఒక్కో కేంద్రం మరమ్మతులకు రూ.10 కోట్లలోపు వ్యయమే కానుండగా, టెండర్లు ఖరారు చేయకపోవడంతో వర్షాకాలంలో ఆయా యూనిట్లలో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
సాగర్, శ్రీశైలం కేంద్రాలకూ మరమ్మతులు నో
రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాలు సగటున ఏటా 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్‌తో పోల్చితే అత్యంత చౌకగా కాలుష్యం లేకుండా జలవిద్యుత్ లభిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (6్ఠ39) మెగావాట్లు కాగా ఇక్కడ మూడో యూనిట్ జనరేటర్ సమస్యతో పనిచేయడం లేదు. దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (6్ఠ40) మెగావాట్లు కాగా, అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకు అవుతోంది.
వీటిల్లో కనీసం ఒక యూనిట్ పనిచేయకపోవచ్చని, తద్వారా 40 మెగావాట్ల విద్యుదుత్పత్తికి నష్టం కలగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ కేంద్రమైన ‘శ్రీశైలం’స్థాపిత సామర్థ్యం 900 (6్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ పనిచేయడం లేదు. జనరేటర్ స్టేటర్, రోటర్లు కాలిపోవడంతో వాటిని మార్చాల్సి ఉంది.
మరో భారీ జలవిద్యుత్ కేంద్రం నాగార్జునసాగర్ స్థాపిత సామర్థ్యం 815.6(1్ఠ110 + 7్ఠ100.8) మెగావాట్లు కాగా, అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ పనిచేయడం లేదు. రోటర్‌కు సపోరి్టంగ్‌గా ఉండే స్ట్రక్చర్‌కు పగుళ్లు రాగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment