మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు | Krishnamma paravallu again: Telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు

Published Sun, Sep 1 2024 1:49 AM | Last Updated on Sun, Sep 1 2024 1:49 AM

Krishnamma paravallu again: Telangana

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లకు పోటెత్తుతున్న కృష్ణమ్మ

శ్రీశైలం ప్రాజెక్టుకి 4.1 లక్షల క్యూసెక్కుల వరద..

10 గేట్లు ఎత్తివేత.. సాగర్‌కు 3.87 లక్షల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం..

26 గేట్ల ఎత్తివేత.. ప్రకాశం బరాజ్‌కి మరింత పెరిగిన ఉధృతి

సముద్రంలోకి 3.31 లక్షల క్యూసెక్కుల వరద విడుదల  

సాక్షి, హైదరాబాద్‌/దోమలపెంట/నాగార్జునసాగర్‌/కడెం: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్‌ వరకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భీకర వరద పోటెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటలకు వరద ప్రవాహం 4,10,581 క్యూసెక్కులకు పెరగడంతో 212.38 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 8 గేట్లను 12 అడుగులు, మరో 2 గేట్లను 10 అడుగుల మేరకు పైకెత్తి 3,12,390 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.

కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,227 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు కలిపి మొత్తం 68,109 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000, హంద్రీ నీవా ద్వారా 1,688, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి కాల్వకు మొత్తం 29,088 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లోలు 4,09,587 క్యూసెక్కులకు పెరిగాయి. 

సాగర్‌ 26 గేట్లు ఎత్తివేత..
దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి 3,87,653 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతుండగా, 308.76 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. సాగ ర్‌ 20 గేట్లను 10 అడుగుల మేర, మరో 6 గేట్లను 5 అడుగు లమేర పైకెత్తి 3,43,810 క్యూసె క్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,313 క్యూసెక్కుల ను కిందికి విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 5,496, ఎడమ కాల్వకు 6,634, ఏఎంఆర్‌పీకి 1,800, ఎల్‌ఎల్‌సీకి 600 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో సాగర్‌ నుంచి మొత్తం అవుట్‌ఫ్లోలు 3,87,653 క్యూసెక్కు లకు పెరిగాయి.

దీంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రవాహానికి తోడు కావడంతో ప్రకాశం బరాజ్‌కి వరద ఉధృతి పెరిగింది. బరాజ్‌కి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 184 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 

ఆల్మట్టికి భారీ వరద..
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టిలోకి వస్తున్న 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. దాని దిగువన నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.78 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,983 క్యూసెక్కులు చేరు తుండటంతో నీటి నిల్వ 94.55 టీఎంసీలకు చేరుకుంది.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్‌
భారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని, సెలవులు తీసుకోరాదని సూచించారు. జలాశయాలు, చెరువుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

కడెం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు శనివారం 22,696 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఏడు వరద గేట్లు ఎత్తి 57,821 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement