పేపర్లు తారుమారు | Telugu question paper instead of Sanskrit in Tandoor tenth exams | Sakshi
Sakshi News home page

పేపర్లు తారుమారు

Published Sat, Mar 22 2025 6:00 AM | Last Updated on Sat, Mar 22 2025 6:12 AM

Telugu question paper instead of Sanskrit in Tandoor tenth exams

వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో సంస్కృతం బదులుగా తెలుగు ప్రశ్నపత్రం 

మంచిర్యాలలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం

వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం 

నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో వెలుగులోకి వచ్చిన ఘటన 

గందరగోళం సృష్టించడానికే ‘వాట్సాప్‌’ప్రచారం చేశారు: పాఠశాల విద్య డైరెక్టర్‌  

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు 

99.67 శాతం హాజరు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, నెట్‌వర్క్‌: పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్‌ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్‌ చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్‌లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు    వేచి ఉండాల్సి వచ్చింది. 

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిన విషయమై పాఠశాల విద్య డైరెక్టర్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గందరగోళం సృష్టించడానికే వదంతులు ప్రచారం చేశారన్నారు. వికారాబాద్, తాండూర్‌లలో సంస్కృతం పేపర్‌కు బదులుగా తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించి అధికారులు మళ్లీ సంస్కృతం పేపర్‌ ఇచ్చి పరీక్ష రాయించారు. 

మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. 

నకిరేకల్‌ నుంచి లీక్‌ అయ్యిందా !  
పదోతరగతి పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాలకే నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని యువకుల వాట్సాప్‌లలో టెన్త్‌ తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. అందులోని ప్రశ్నలకు అనుగుణంగా టెస్ట్‌ పేపర్లలోని జవాబు పత్రాలతో యువకులు హల్‌చల్‌ చేశారు. జవాబులన్నీ ఒకే పేపర్‌లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు హల్‌చల్‌ చేశారు. 

అయితే బందోబస్తులో ఉన్న పోలీసులు విషయం తెలియక పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు అనుగుణంగా జిరాక్స్‌ తీసిన జవాబుల ప్రతులు ఆ సమయంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు చేరాయా? లేదా? ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ఎక్కడెక్కడికి వెళ్లిందన్నది తేలాల్సి ఉంది. 

ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై అధికారులు శాలిగౌరారం, నకిరేకల్‌ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం గోప్యంగా విచారణ జరిపారు. బయటకు వచ్చిన ఆ ప్రశ్నపత్రం నకిరేకల్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి లీక్‌ అయినట్టు తెలిసింది. దీనికి బాధ్యుడైన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.  

45 నిమిషాల పాటు పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు 
ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష ముగింపు సమయం గడిచినా, 45 నిమిషాల వరకు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించలేదు. లీకైన పేపర్‌ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలతో సరిపోల్చి చూశారు. లీకైన పేపర్‌ సీరియల్‌ నంబరుతో మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్‌ సీరియల్‌ నంబర్లతో పోల్చి చూశారు. లీకైన టెన్త్‌ తెలుగు ప్రశ్నపత్రం సీరియల్‌ నంబరు 1495550గా అధికారులు గుర్తించారు. 

విచారణ తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. సీరియల్‌ నంబరు వేరుగా ఉన్నా, అందులోని ప్రశ్నలకు, విద్యార్థులకు అందజేసిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు మధ్య తేడా ఏమీ లేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. లీకేజీ ఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్‌లో నివాసముంటున్న ఆ ఉపాధ్యాయుడు తన కుమార్తె కోసమే ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనపై విచారణ జరిపామని నల్లగొండ డీఈవో భిక్షపతి పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ రామ్మోహన్‌రెడ్డిలను పరీక్ష విధుల నుంచి తొలగించారు. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేశారు. నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదో తరగతి తెలుగు పేపరు లీకేజీ ఘటనలోనే వారిపై చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

సంస్కృతం బదులు తెలుగు పేపర్‌  
వికారాబాద్‌ జిల్లా తాండూరులోని టీజీఎస్‌ఆర్‌ బాలికల గురుకులానికి చెందిన టెన్త్‌ విద్యార్థి నాగలక్షి్మతోపాటు మరో విద్యార్థి పట్టణంలోని శివసాగర్‌ కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. అయితే తమకు సంస్కృతం ప్రశ్నపత్రానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారని చెప్పినా, ఇదే మీ పేపర్‌ అంటూ ఆ విద్యార్థులతో బలవంతంగా పరీక్ష రాయించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తమ తప్పిదాన్ని గుర్తించిన ఇని్వజిలేటర్లు ఆ ఇద్దరు విద్యార్థులతో 3 గంటల వరకు సంస్కృతం పేపర్‌ రాయించారు.  

తాండూరులోని ఫ్రంట్‌లైన్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లోనూ తెలంగాణ గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్‌ విద్యార్థి అంకితతో సంస్కృతం బదులు తెలుగు పేపర్‌ రాయించారు. గంట తర్వాత అసలు విషయం తెలుసుకొని సంస్కృతం పేపర్‌ అందజేశారు.  

తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం 
మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలోకి మొదటిరోజు ప్రశ్నపత్రం బదులు.. రెండోరోజు ప్రశ్నపత్రాలు రావడంతో గందరగోళం నెలకొంది. అధికారుల తప్పిదంతో విద్యార్థులు రెండు గంటల ఆలస్యంగా పరీక్ష రాశారు. తొలిరోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఉన్నట్టు గుర్తించి, మళ్లీ 20 బాక్సులను వెతికి తెలుగు ప్రశ్నపత్రం తీసుకొచ్చేలోపు సమయం వృథా అయ్యింది. 

ఈ ఘటనపై కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ వివరణ ఇస్తూ. ట్రంకు బాక్సులో రెండో రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు, ప్రశ్నపత్రాల కవర్‌ తెరవకుండానే గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రం ఏ బాక్సులో ఉందో వెతికేందుకు గంటన్నర సమయం పట్టిందని, విద్యార్థులు ఆ సమయం నష్టపోకుండా పరీక్షకు 3 గంటలు యథావిధిగా కల్పించామన్నారు. 

రెండో రోజు పరీక్ష పత్రం లీక్‌ కాలేదని, పోలీసుస్టేషన్‌లో భద్రంగా ఉందన్నారు. పరీక్ష సజావుగా నిర్వహించని కారణంగా పరీక్ష కేంద్రం చీప్‌ సూపరింటెండెంట్‌ సప్థర్‌ అలీఖాన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ పద్మజలను సస్పెండ్‌ చేసి, వీరిస్థానంలో మరొకరికి బాధ్యతలు ఇచ్చామన్నారు. 

కేంద్రాలకు వెళ్లడమూ ఓ పరీక్షే  
సాక్షి, నాగర్‌కర్నూల్‌/కన్నాయిగూడెం: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్‌ మండలం వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు రోజూ పరీక్షలు రాసేందుకు 25 కి.మీ దూరంలోని దోమలపెంటకు రావాల్సి వస్తోంది. అటవీమార్గం గుండా ఉన్న రహదారిపై ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు గంటన్నర, తిరిగి వచ్చేందుకు గంటన్నర సమయం పడుతోంది. దీంతో ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 6.30 గంటలకే వటవర్లపల్లి వద్ద బయలుదేరి, రానూపోనూ కలపి మొత్తం 50 కి.మీ. ప్రయాణించి పరీక్షలు రాస్తున్నారు.  
కన్నీటి పరీక్ష  
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తపూర్‌ గ్రామానికి చెందిన మంచర్ల మల్లయ్య గురువారం రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. శుక్రవారం ఉదయం ఓ వైపు అంతిమ సంస్కారాలు జరుగుతుండగానే ఆయన కూతురు శ్రీలత పరీక్షకు హాజరైంది.  
నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల్‌ గ్రామానికి చెందిన పాలెం అంజన్న శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ బాధతోనూ ఆయన కూతురు అంజలి పరీక్ష రాశారు.  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కల్తిరామయ్యగుంపు గ్రామానికి చెందిన కనపటి వీరస్వామి(45) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షిత, ప్రియ రొంపేడులోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తండ్రి చనిపోయిన విషయం పరీక్ష రాశాక కూతుళ్లకు చెప్పారు. ఇంటికి చేరుకున్నాక ‘నాన్నా.. లే.. నాన్నా..’అంటూ వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.  

అనారోగ్యాన్ని లెక్క చేయకుండా... 
సిద్దిపేట/రామగుండం – సిద్దిపేటకు చెందిన శ్వేత కేజీబీవీ మిట్టపల్లిలో 10వ తరగతిలో చదువుతోంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడటంతో కాలు విరిగింది. శుక్రవారం ఉదయం రంగధాంపల్లి పరీక్ష కేంధ్రానికి వద్దకు శ్వేత అంబులెన్స్‌లో వచ్చింది. స్ట్రెచర్‌ పైనే బంధువుల సాయంతో పరీక్ష రాసింది.  
పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్‌ జెడ్పీ హైసూ్కల్‌లో శుక్రవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి నందన్‌వర్మ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆయన పర్యవేక్షణలో విద్యార్థి పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తయ్యాక 108 అంబులెన్స్‌లో అదే పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. బాలుడు కోలుకున్నట్టు డాక్టర్‌ తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement