రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 2,615 కేంద్రాల్లో ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక్క ద్వితీయ భాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ పరీక్షలకు 5,67,478 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తారని... అంతకుమించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,57, 595 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షకేంద్రానికి ముందుగా చేరుకోవాలని సూచించారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. మొదటి రోజు ట్రాఫిక్ పాటు పరీక్ష కేంద్రం కోసం వెతుక్కోవలసిన పరిస్థితుల దృష్ట్యా పరీక్షకు వచ్చే వారికి అరగంట ఆలస్యమైనా అనుమతిస్తామన్నారు. మిగతా రోజుల్లో మాత్రం పరీక్ష ప్రారంభమానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.