ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: వేసవి ఆరంభానికి ముందే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. మరో ఆరు నెలల వరకు డ్యామ్ నీటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడే నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరాయి. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా నేడో రేపో ఆ మట్టానికి నిల్వలు చేరనున్నాయి. ప్రస్తుతం కేవలం 834.20 అడుగుల్లో వినియోగార్హమైన నీటి లభ్యత కేవలం 0.20 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ లభ్యత నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
గతేడాది 101.. ఇప్పుడు 54 టీఎంసీలు
ఏపీలోని కేసీ కెనాల్, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు కింది అవసరాలతో పాటు సాగర్ కింది అవసరాలకు శ్రీశైలం ప్రధాన నీటి వనరుగా ఉంది. అయితే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు తమ సాగు, తాగునీటి అవసరాలకు గణనీయంగా నీటిని మళ్లించుకోవడంతో ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. గతేడాది 885 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 858.70 అడుగుల మట్టంలో 101.92 టీఎంసీల మేర నిల్వలుండగా.. ప్రస్తుతం 834.20 అడుగుల మట్టంలో 54.15 టీఎంసీల మేర నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఇందులో కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్నది కేవలం 0.20 టీఎంసీలు. ఈ నీటితో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల కింది అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేది కాదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దిగువకు వెళ్లాలని ఏపీ ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోంది. తమ అవసరాలకు అనుగుణంగా కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఏపీ విన్నవించింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా జూలై నెలాఖరు వరకు లభ్యత నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున ఆచితూచి వాడుకోవాలని సూచించింది.
బోర్డు భేటీలోనే స్పష్టత: కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశంపై కృష్ణా బోర్డు నిర్ణయమే కీలకం కానుంది. భేటీపై స్పష్ట త లేదు. గతనెలలో భేటీ ఉంటుందని భావించగా, తుంగభద్ర బోర్డు భేటీ కారణంగా అది జరగలేదు. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన కోరినంత మేర నీటి నిల్వలు లేనట్టయితే దిగువకు వెళ్లయినా నీటిని కేటాయించాలన్న ఏపీ వినతిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు.
లేకుంటే సాగర్‌పైనే..
శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు వెళ్లలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నీటిపైనా ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాగర్‌లో 534.8 అడుగుల మట్టంలో 177.66 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 46 టీఎంసీలు. ఈ నీటినే రెండు రాష్ట్రాలు సర్దుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలో తెలంగాణకు ఇంకో 29 టీఎంసీలు, ఏపీ మరో 5 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. మరో 13 టీఎంసీల నీటిని తెలంగాణ అవసరాల కోసం రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరు ఇరు రాష్ట్రాల అవసరాలను తీర్చడం కష్టమే. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి తోడటం ఖాయమేననిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment