సాక్షి, అమరావతి: ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో ఒక రాష్ట్రం వాడుకోని కోటా జలాలను మరుసటి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి ఆ రాష్ట్రానికే అనుమతిస్తే.. మరో రాష్ట్రం హక్కులను దెబ్బతీసినట్లవుతుందని తెలంగాణ సర్కార్‌కు కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. కోటాలో వాడుకోకుండా మిగిలిన నీళ్లు క్యారీ ఓవర్ జలాలే అవుతాయని స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెగేసి చెప్పింది.
రెండు రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకొని.. ఏకాభిప్రాయం ద్వారా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని సూచించింది. గతేడాది జూన్ 6న ఇదే అంశాన్ని అటు తెలంగాణ సర్కార్‌కు.. ఇటు కృష్ణాబోర్డుకు సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. అయినా సరే.. తెలంగాణ సర్కార్ కోటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకుంటామంటూ వితండవాదన మళ్లీ తెరపైకి తెస్తూ వివాదం రాజేస్తుండటం గమనార్హం.
నీటి నిల్వపై నేరుగా ప్రభావం
నాగార్జునసాగర్‌లో కోటాలో వాడుకోని జలాలను మరుసటి సంవత్సరం వాడుకుంటామని తెలంగాణ సర్కార్ ఇటీవల కృష్ణాబోర్డును కోరింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనకు కృష్ణాబోర్డు అంగీకరిస్తే.. సాగర్‌లో నీటినిల్వపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొత్త నీటి సంవత్సరంలో వచ్చే వరద జలాలతో నిండాక.. మిగులు జలాలను దిగువకు వదిలేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ సర్కార్ కోటాలో వాడుకోని నీటిని మరుసటి సంవత్సరం వాడుకోవడానికి అనుమతిస్తే ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందన్నది స్పష్టమవుతోంది.
కేంద్ర జలసంఘం తెగేసిచెప్పినా సరే..
కృష్ణాజలాల్లో 2021–22లో కోటాలో వాడుకోకుండా మిగిలిన 47.79 టీఎంసీలను 2022–23లో నాగార్జునసాగర్ కింద వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్ కృష్ణాబోర్డును కోరింది. దీనిపై కృష్ణాబోర్డు సీడబ్ల్యూసీని సంప్రదించింది. కోటాలో వాడుకోని నీళ్లన్నీ క్యారీ ఓవర్ జలాలే అవుతాయని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కార్ అదే ప్రతిపాదనను తెరపైకి తేవడంపై కృష్ణాబోర్డు అసహనం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment