Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?.. | Happy New Year 2025: New Year Resolutions for Children | Sakshi
Sakshi News home page

Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..

Published Mon, Dec 30 2024 11:25 AM | Last Updated on Mon, Dec 30 2024 11:40 AM

Happy New Year 2025: New Year Resolutions for Children

ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. 
.. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి
.. సరైన డైట్‌ను మెయింటెన్‌ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. 
.. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. 
.. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. 

ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్‌ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్‌ పేరుతో  ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్‌లో మీమ్స్‌(Resolutions Memes) వైరల్‌ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..

కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్‌  తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట.  అయితే..

ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్‌ వైబ్‌ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్‌లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.

కొత్త ఏడాది రెజల్యూషన్స్‌ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్‌ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు.  అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.

లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్‌ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో..  వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది.  ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో  అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం.  అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.

జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి..  దీన్నొక భవిష్యత్‌ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగ​స్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!.   నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.

కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం.  న్యూఇయర్‌ రెజల్యూషన్స్‌(NewYear's Resolutions)లో.. వయసుతో  సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.

న్యూ ఇయర్ రిజల్యూషన్‌లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్‌ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది.  అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement